March 13, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: ఉదయాన్నే బడికి వెళ్లిన విద్యార్థులు.. హెడ్మాస్టర్ రూమ్‌ ముందు కనిపించింది చూసి షాక్..



అదో పాఠశాల. అంధవిశ్వాసాలను పారద్రోలి.. శాస్త్రీయతను బోధించే విద్యానిలయం. కానీ, అక్కడ మూఢవిశ్వాసాన్ని కళ్లకుగడుతూ కనిపించిన క్షుద్రపూజలు విద్యార్థుల్ని ఆందోళనకు గురిచేశాయి. కరీంనగర్ జిల్లాలో ఓ పాఠశాల ఆవరణలో క్షుద్రపూజల కలకలం అటు విద్యార్థీ లోకంతో పాటు.. పాఠాలు బోధించే గురువులనూ ఆశ్చర్యానికి గురి చేస్తూ చర్చను లేవనెత్తింది.

కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ జిల్లా పరిషత్ పాఠశాలకు ఎప్పటిలాగే విద్యార్థినీ, విద్యార్థులు ఉదయాన్నే యథావిధిగా వచ్చారు. ఒక్కసారి స్కూల్ ఆవరణలోకి అడుగుపెట్టేసరికి హెడ్ మాస్టర్ గది ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు చేసి, ముగ్గు వేసిన దృశ్యం ఆ విద్యార్థుల్ని ఆందోళనకు గురిచేసింది. పక్కనే చెల్లాచెదురుగా పడి ఉన్న నిమ్మకాయలతో ఏం జరిగి ఉంటుందన్న విషయం ఆ పసి హృదయాలకు అర్థం కాలేదు. వెంటనే వారి గురువుల వద్దకు విషయాన్ని తీసుకెళ్లారు. అప్పుడప్పుడే బడికి చేరుకుంటున్న టీచర్లూ ఆ క్షుద్రపూజల ముగ్గులు చూసి అవాక్కయ్యారు.

అసలు ఎవరు చేసుంటారు ఈ పని అన్నది ఇప్పుడు దుర్శేడ్ జెడ్పీ హైస్కూల్‌లో చర్చనీయాంశంగా మారింది. పిల్లలను ఎవరైనా టార్గెట్ చేసుకుని ఏవైనా క్షుద్ర ప్రయోగాలు చేసుంటారా… లేక, బళ్లో గురువులంటే పడనివారి పనయ్యుంటుందా… లేక, మధ్యాహ్నం మాత్రమే బిజీగా ఉంటూ రాత్రంతా కామ్‌గా ఉంటుందని ఈ బడిని తమ క్షుద్రపూజల కోసం ఎంచుకుని ఉంటారా.. ఇలా పలురకాల అనుమానాలకు ఆస్కారమిచ్చింది దుర్శేడ్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌లోని నిమ్మకాయల దృశ్యం.

స్కూల్ హెడ్మాస్టర్ స్థానిక కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ పని ఎవరు చేసి ఉంటారనే కోణంలో ఇప్పుడు విచారణ చేపట్టారు. కానీ, రేపట్నుంచీ పిల్లల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రుల్లోనూ ఒకింత తెలియని ఆందోళనకు అవకాశం కల్పించింది తాజాగా కనిపించిన క్షుద్రపూజల దృశ్యం. దీంతో పేరెంట్స్ ఆందోళనకు గురవుతుండగా… విద్యార్థినీ, విద్యార్థులు భయపడుతున్నారు. మరి రేపట్నుంచి ఎందరు విద్యార్థినీ, విద్యార్థులు స్కూల్ కు వస్తారోనన్న ఒకింత ఆందోళన ఇటు గురువుల్లోనూ నెలకొంది. శాస్త్రీయత నేర్పించే చోట ఇలాంటి మూఢాచారాలకు సంబంధించిన క్షుద్రపూజల కలకలంతో.. ఇప్పుడు దుర్శేడ్ జిల్లా పరిషత్ స్కూల్ ఒక్కసారిగా పెను చర్చకు తెరలేపింది

Also read



Related posts

Share via