July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

యువకుల నుంచి డబ్బులు స్వాధీనం.. సస్పెన్స్ మూవీ థ్రిల్లర్‎ను తలపించే ఓ సంఘటన

రాచకొండ కమిషనరేట్ పరిధిలో సస్పెన్స్ మూవీ థ్రిల్లర్‎ను తలపించే ఓ సంఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీసుల తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడ్డాయి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఓ యువకుడు ఆత్మహత్యకు దారి తీసింది. డబ్బులు దాచిపెట్టిన పోలీసులను సస్పెండ్ చేయగా సూసైడ్‎తో పాటు ఆ డబ్బు ఎవరిది అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.

శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కీసర గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కరీంగూడా చౌరస్తాలో కానిస్టేబుల్ శ్రీకాంత్ AR హెడ్ కానిస్టేబుల్ కృష్ణ విధుల్లో ఉన్నారు. అదే సమయంలో బైక్‎పై సాయి కుమార్ కార్తీక్‎లు బ్యాగ్‎తో వస్తున్నారు. వారిని ఆపి తనిఖీలు చేసిన ఇద్దరు కానిస్టేబుల్స్ బ్యాగులలో రూ.25 లక్షల నగదును గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని సాయికుమార్ కార్తీక్‎లను కానిస్టేబుల్ శ్రీకాంత్ యాదవ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణలు ఇబ్బందులకు గురి చేశారు. రెండు గంటల తర్వాత రూ.25 లక్షల నుంచి రూ.18.5 లక్షలు తనిఖీల్లో దొరికినట్లుగా డ్రామా ఆడారు. డబ్బులు తీసుకెళ్తున్న సాయికుమార్, కార్తీక్‎లను కీసర ఇన్స్పెక్టర్ వెంకటయ్యకు అప్ప చెప్పారు. అయితే సాయికుమార్, కార్తీక్‎లు నగదు రూ.18.5 లక్షలు కాదని మొత్తం రూ.25 లక్షల రూపాయలు అని ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రూ.6.50 లక్షలు కానిస్టేబుల్ దాచి పెట్టారని వివరించారు.

ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. డబ్బు తరలింపుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రూ.25 లక్షల నగదు తరలింపు సమాచారం పోలీస్ కానిస్టేబుల్ శ్రీకాంత్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణకు చర్లపల్లిలో నివాసం ఉండే రంజిత్ సమాచారం ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. శనివారం సాయికుమార్, కార్తిక్‎లు రూ.25 లక్షల నగదు తీసుకువస్తున్నారని.. వారిని పట్టుకుంటే డబ్బులు వదిలేసి పారిపోయే అవకాశం ఉందని ముందుగా తెలిపాడు. వచ్చిన దాంట్లో తనకు వాటా ఇవ్వాలని కోరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డబ్బు పట్టుబడిన విషయాన్ని యజమానికి చెప్పగా.. దీంతో ఆ యజమాని రంజిత్‎ను నిలదీశాడు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యపై చర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రూ. 6.5 లక్షల కొట్టేసిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీకాంత్ యాదవ్, కృష్ణల నుంచి రికవరీ చేసి ఇద్దరిని సిపి తరుణ్‎ సస్పెండ్ చేశారు. రంజిత్ ఆత్మహత్య కేసులో ఈ ఇద్దరు కానిస్టేబుల్‎తో పాటు మరి కొందరిని విచారించాల్సి ఉంది. ఈ కారణంగా ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించలేమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ డబ్బు రాజకీయ పార్టీ నాయకులకు చెందినదా లేదా వ్యాపారస్తులకు చెందిన అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Also read

Related posts

Share via