SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: మత్తు కోసం మెడికల్‌ డ్రగ్ తీసుకుని ఇంటర్‌ విద్యార్థి మృతి



తల్లిదండ్రులూ బీ అలర్ట్. పిల్లలపై మత్తు ముఠాలు కొత్తకొత్త మార్గాల్లో వల విసురుతున్నాయి. మార్కెట్‌లో ఈజీగా దొరికే పెయిన్‌ కిల్లర్స్‌నే మత్తుమందుగా మార్చేస్తూ..విద్యార్ధులను, యువకులను బానిసలుగా మార్చేస్తున్నాయి. హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఓ ఘటన పిల్లల తల్లిదండ్రులతో పాటు పోలీసులను కూడా కలవర పెడుతోంది.

మత్తు కోసం పెయిన్‌ కిల్లర్ ఇంజక్షన్‌ వాడిన ఓ ఇంటర్‌ విద్యార్ధి.. అది వికటించడంతో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో వెలుగుచూసింది ఈ ఘటన. మత్తు కోసం ఇంజక్షన్, ట్యాబ్లెట్లు కలిపి తీసుకున్నారు ముగ్గురు విద్యార్థులు. దీంతో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసిన బాలాపూర్‌ పోలీసులు..మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న సాహిల్ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

విద్యార్థి మరణానికి కారణమైన మత్తు ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు..మృతుడి కుటుంబ సభ్యులు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక మంది అమాయకులకు ఇలా మత్తు పదార్థాలు ఇచ్చి బానిసలుగా మార్చుకుంటున్నారని..వారిపై చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని చెబుతున్నారు.

హైదరాబాద్‌లోనే కాదు అటు ఏపీలో కూడా ఈ తరహా మత్తు ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏపీ ప్రభుత్వం గంజాయిని కట్టడి చేయడంతో మత్తు కోసం కొత్తమార్గాలను అన్వేషిస్తున్నారు. ఇదే క్రమంలో బాపట్లలో మత్తు కోసం పెయిన్ కిల్లర్ మందులను ఇంజెక్షన్ ద్వారా ఉపయోగిస్తున్న యువకులను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గంజాయిపై ఉక్కుపాదం మోపడంతో మత్తుకోసం కొంతమంది యువకులు ఇలా పెయిన్‌ కిల్లర్స్‌ను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు..పోలీసులు. వేర్వేరు కారణాలతో మెడికల్‌ షాపులనుండి ట్యాబ్లెట్స్‌ను కొనుగోలు చేసి వాటిని పొడిగా మారుస్తున్నారు. ఆ పొడిని ఇతర లిక్విడ్స్‌లో కలిపి ఇంజక్షన్‌ రూపంలో తీసుకుంటున్నారు.

Also read

Related posts

Share this