అనుమానమే పెను భూతమైంది.. ఆ ఫలితమే ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది.. వెంటాడి మరీ చంపేవరకూ వచ్చింది.. ఎట్టకేలకు ఈ దారుణానికి పాల్పడినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. సభ్య సమాజం తల దించుకునేలా హైదరాబాద్ మహానగరంలో క్షుద్రపూజలు చేశారన్న అనుమానం బాధిత బతుకుల్లో చిచ్చు పెట్టింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ నగరం బండ్లగూడ ప్రాంతంలోని మహమ్మద్ నగర్‌కు చెందిన షేక్ అక్తర్ అలీ(72)కి భార్య, ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు షేక్ మహమ్మద్ అలీ(32), షేక్ ఉస్మాన్(25). అయితే.. వీరు ఉంటున్న ఇంటి పక్కనే 2018 సంవత్సరంలో మహమ్మద్ గౌస్ అనే మరో వ్యక్తి కుటుంబం నివసించేది. గౌస్‌కు మహమ్మద్ ఆజంతో పాటు మహమ్మద్ మాజిద్ అనే ఇద్దరు సంతానం. ఇదిలా ఉండగా.. పక్కపక్కనే నివసిస్తున్న షేక్ అక్తర్ అలీ కుటుంబంతో 2018 నుంచే గౌస్ కుటుంబానికి గొడవలు ఉన్నాయి. దీంతో గౌస్ కుటుంబం వట్టేపల్లి ప్రాంతానికి మకాం మార్చింది. స్థానిక తీగలకుంట ప్రాంతంలో గౌస్ కుమారులైన మహమ్మద్ ఆజం, మహమ్మద్ మాజిద్ అక్కడ పాన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉండగా, గౌస్ కుటుంబంతో గొడవ జరిగిన 10 రోజులకే షేక్ అక్తర్ అలీ భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పుడే మొదటిసారి అనుమానం మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే షేక్ అక్తర్ అలీ కూడా అనారోగ్యానికి గురయ్యాడు.
అంతటితో ఇది ఆగిపోకుండా అలీ అనారోగ్యానికి లోనైన కొన్ని రోజులకే అతని చిన్న కొడుకు షేక్ ఉస్మాన్ ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇలా వరుసగా ఎవరో ఒకరు చనిపోవడం, లేదా ఇంట్లో వాళ్లు జబ్బు పడడం గమనించిన ఆ కుటుంబం దీని వెనక ఏదో కారణం ఉందని భావించింది. తీరా అది కాస్తా తమ కుటుంబంతో గొడవలు ఉన్న మహ్మద్ గౌస్ కుటుంబంపై షేక్ అక్తర్ అలీ కుటుంబానికి అనుమానం మొదలైంది. తమ కుటుంబంపై క్షుద్రపూజలు చేయడం వల్లే ఇలా వరుసగా ఇంట్లో వాళ్లకి ఏదో ఒకటి అవుతుందని మరింత బలంగా నమ్మారు. ఆ పిచ్చి నమ్మకం కాస్తా ప్రత్యర్థి కుటుంబంపై కక్ష పెంచుకునే వరకూ దారితీసింది. గౌస్ కుటుంబం క్షుద్రపూజలు చేయడం వల్లే ఇలా అయిందన్న అనుమానం పెను భూతమైంది. దీంతో గౌస్ కుటుంబంపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. గౌస్ కుటుంబంలోని ఎవరో ఒకరిని చంపేవరకూ వదిలేది లేదని షేక్ అక్తర్ అలీ అతని ఇద్దరు కుమారులు షేక్ మహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ కుట్ర పన్నారు.
ఈ హత్యోదంతానికి ఈ నెల 2వ తేదీ అయితే బాగుంటుందని పథకం వేశాడు. అది కూడా శుక్రవారం మధ్యాహ్నం బయట రోడ్లపై జనం ఎక్కువ ఎవరూ ఉండరని, అదే సరైన సమయమని ప్లాన్ చేశారు. అనుకున్నదే తడవుగా పని మొదలుపెట్టాలని అన్నీ రకాలుగా సిద్ధమయ్యారు. ఇక 2వ తేదీ శుక్రవారం ఉదయం మాజిద్ స్టార్ కాఫీ డే, స్టార్ పాన్ మహల్ తెరిచి ఎప్పటిలాగే వ్యాపారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న షేక్ అక్తర్ అలీ తన ఇద్దరు కుమారులతో బైక్‌పై మాజిద్ పాన్ షాప్ వద్దకు చేరుకున్నారు. తండ్రి పాన్ షాప్ కు దూరంగా బైక్ వద్ద నిలబడి ఉండగా షేక్ మహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీలు నడుచుకుంటూ పాన్ షాప్ దగ్గరకు వెళ్లారు. మాజిద్‌ను బయటికి పిలిచి ఉన్నఫళంగా గొడవకు దిగారు. రెండు వైపులా వాగ్వాదం జరుగుతుండగానే కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు మాజిద్ ఎంత ప్రయత్నించినప్పటికీ అతని వెంటపడి మరీ కత్తులతో దారుణంగా చంపారు.
హత్య ఘటనపై ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్‌స్పెక్టర్ కే.ఆదిరెడ్డితో కలిసి ఫలక్‌నుమా డివిజన్ ఏసీపీ ఎం.ఏ జావిద్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశారు. మృతుడి సోదరుడు మహమ్మద్ ఆజం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. తమ కుటుంబంపై క్షుద్రపూజలు చేశారన్న అనుమానంతో యువకుడిని కత్తులతో దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న తండ్రి, ఇద్దరు కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులు ముగ్గురిని సోమవారం రిమాండ్‌కు తరలించారు.
Also Read
- నేటి జాతకములు…23 మే, 2025
- Garuda Puran: గరుడ పురాణంలో ఆత్మహత్య చేసుకున్న జీవికి వేసే శిక్షలు తెలిస్తే.. సూసైడ్ అన్న మాటే తలవరు
- శుభకార్యం ఆనందం తీరకముందే అంతులేని విషాదం.. ఒకరిని రక్షించబోయి మరొకరు..
- జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం
- Andhra: ఫుల్లుగా తాగి.. ఛీ ఛీ ఏంట్రా ఇది..! ఆటోకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి…..