సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజలను నమ్మించి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రజలు సైతం అత్యాశకు పోయి మోసపోతున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యాపారి నుంచి కేటుగాళ్లు రూ.1.38కోట్లు కొట్టేశారు. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రకరకాల పద్ధతులలో కేటుగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. వాళ్లు చెప్పింది నిజమని నమ్మి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నగరంలోని ఒక వ్యాపారిని నిండా ముంచారు. వనస్థలిపురానికి చెందిన ఆ వ్యాపారికి నమ్మకం కలిగించి, దశలవారీగా ఏకంగా రూ. 1.38 కోట్లు దోచుకున్నారు. ఈ మోసం వెయ్యి రూపాయల చిన్న లాభంతో మొదలై, చివరికి పెద్ద నష్టానికి దారితీసింది. జూన్ 21న బాధితుడి ఫోన్ నంబర్‌ను నిందితులు ‘డీ18 ఇండియా స్టాక్ పండిట్స్ సర్కిల్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత సురభి గుల్షన్ సింగ్, సొబ్టి అనే ఇద్దరు వ్యక్తులు అతనికి ఫోన్ చేసి, తాము స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో నిపుణులమని, అధిక లాభాలు ఇప్పిస్తామని నమ్మించారు. అనంతరం ‘దేవ ఏ టీమ్ 17’ అనే మరో వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి, ట్రేడింగ్ కోసం ఒక లింక్‌ను పంపించారు. బాధితుడు ఆ లింక్ ద్వారా ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ట్రేడింగ్ ప్రారంభించాడు.
రూ.50వేలకు వెయ్యి లాభం
జూలై 21న అతను మొదటిసారిగా రూ. 50 వేలు పెట్టుబడి పెట్టగా, సైబర్ నేరగాళ్లు అతడికి వెయ్యి రూపాయల లాభం వచ్చినట్లు చూపించి, ఆ డబ్బును బాధితుడి ఖాతాలో జమ చేశారు. దీనితో బాధితుడికి వారిపై నమ్మకం బలపడింది. ఆ తర్వాత అతను రూ. 2 లక్షలు, మరో రూ. 3 లక్షలు డిపాజిట్ చేశాడు. స్క్రీన్‌పై లాభాలు భారీగా పెరుగుతున్నట్లు చూపించి, అతన్ని మరింత పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు.
లాభాల మాయలో పడి..
రూ. 8.5 లక్షలు డిపాజిట్ చేస్తే, ‘ఇనిస్టిట్యూషనల్ స్టాక్స్’ కేటాయించినట్లు నమ్మించి, స్క్రీన్‌పై రూ. 17 లక్షల లాభం చూపించారు. ‘లోన్ల ద్వారా ఫండ్స్ జమ చేస్తాం, మీరు పెట్టుబడి పెట్టండి’ అంటూ ప్రోత్సహించారు. రూ. 1.73 కోట్ల విలువైన 7080 షేర్లను కేటాయించామని, దానివల్ల రూ. 3.5 కోట్లు లాభం వచ్చిందని నమ్మించారు. దీంతో బాధితుడు రూ. 65 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత మరో 5.2కోట్ల షేర్స్ కేటాయిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత రూ.40కోట్లు లాభాలు వచ్చినట్లు చెప్పడంతో బాధితుడు నమ్మాడు. ఈ క్రమంలో మరో రూ.25లక్షలు డిపాజిట్ చేశాడు. ఇలా పలు దఫాలుగా బాధితుడు రూ. 1,38,30,000 డిపాజిట్ చేశాడు. అయితే ఈ మొత్తం పెట్టుబడికి గాను అతనికి తిరిగి వచ్చింది కేవలం రూ. 1000 మాత్రమే.
కమీషన్ ఇస్తేనే..
స్క్రీన్‌పై రూ. 40 కోట్ల లాభం ఉన్నట్లు కనిపించడంతో, బాధితుడు అందులో నుంచి రూ. 4.6 కోట్లు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించాడు. డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు, సైబర్ నేరగాళ్లు తమ నిజస్వరూపం బయటపెట్టారు. వచ్చిన లాభాలపై 5శాతం కమిషన్ అంటే రూ. 1.7 కోట్లు చెల్లిస్తేనే డబ్బు విత్‌డ్రా చేసుకోవడం సాధ్యమవుతుందని మెలిక పెట్టారు. తన వద్ద ఉన్న డబ్బు మొత్తం పెట్టుబడి పెట్టానని, లాభం నుంచి కమిషన్ మినహాయించుకుని మిగతా డబ్బు ఇవ్వాలని బాధితుడు కోరగా, వారు అంగీకరించలేదు. దీంతో అనుమానం వచ్చి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు