హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో పోలీస్ కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు ఓ యువకుడు. టోలిచౌకీ నుంచి ఎక్కువ వేగంతో బైక్ నడుపుకుంటూ వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్, ఒమేగా హాస్పిటల్స్ రోడ్ వద్ద ఒక కారును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కార్ డ్రైవర్, ఖాజా అనే వ్యక్తి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవ పెట్టుకున్నారు. అదే సమయంలో ఆ రూట్‌లో డ్యూటీ నిమిత్తం వెళ్తున్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ఘటనను గమనించి ఇద్దరినీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కాని ఖాజా తన తప్పని ఒప్పుకోకుండా మరింత దూకుడుగా వ్యవహరించాడు. శ్రీకాంత్ వారించేందుకు వచ్చాడని గమనించిన ఖాజా, పక్కనే ఉన్న బీర్ బాటిల్‌ను తీసుకుని కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దాడి చేసి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. రెండు కిలోమీటర్ల పాటు అతన్ని చేజ్ చేసిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ఎట్టకేలకు ఖాజాను అదుపులోకి తీసుకున్నాడు.
దాడి అనంతరం బంజారాహిల్స్ పోలీసులు తక్షణమే స్పందించి ఖాజాపై చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ శ్రీకాంత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. శ్రీకాంత్ గాయపడడంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఖాజా దూకుడుగా వ్యవహరించడంతో పాటు, మద్యం మత్తులో ఉండి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్పందించారు. గాయపడిన కానిస్టేబుల్ శ్రీకాంత్‌ను పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా బంజర హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న సిటీ న్యూరో హాస్పిటల్లో కానిస్టేబుల్ శ్రీకాంత్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానిస్టేబుల్ శ్రీకాంత్ తోపాటు ఆ కారు నడిపిన డ్రైవర్ బంజారాహిల్స్ పోలీసులకు బైక్ రేసర్ ఖాజాపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా బైక్ రేసర్ ఖాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Also read
- కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
- AP Crime: ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు
- AP News: ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు
- Adilabad : ఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే