సామాన్యుడికి అందనంత ఎత్తులో బంగారం ధరలు చుక్కలనంటుతోంది. తులం బంగారం దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంది. బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇలా బంగారం ధరలు మండిపోతున్న వేళ, కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా భావించి నకిలీ బంగారాన్ని అంటగట్టి అమాయకులను మోసం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం ప్రాంతం సంచార జాతికి చెందిన కొందరు సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వుకు వచ్చారు. స్థానికంగా కౌజు పిట్టలు, పావురాలు పట్టి విక్రయించి జీవనం సాగించేవారు. దీంతో వీరికి స్థానికులతో పరిచయం ఏర్పడింది. స్థానికుల ఫోన్ నెంబర్లు తీసుకుని తక్కువ ధరకు ఒకటి, రెండుసార్లు కౌజు పిట్టలను అందించి మరింత పరిచయం పెంచుకున్నారు. కొద్దిరోజుల తర్వాత సంచార జాతి చెందినవారు హిందూపూర్ కు వెళ్ళి పోయారు.
20 రోజుల క్రితం తమ సమీప బంధువు ఎక్స్కవేటర్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా అతడికి వ్యవసాయ పొలంలో లంకె బిందెలు దొరికాయని, మేళ్లచెరువులో పరిచయమైన శంభిరెడ్డికి ఫోన్ చేశారు. వాటిని ఎక్కడ అమ్మాలో తెలియడం లేదంటూ వీడియో చూపించారు. కావాల్సిన వారికి తక్కువ ధరకు అందిస్తామని శంభిరెడ్డికి చెప్పారు. దీంతో 15 రోజుల క్రితం శంభిరెడ్డి.. అనంతపురం జిల్లా హిందూపూర్ కు వెళ్లాడు. ఆయనకు శాంపిల్‌గా కొంత అసలు బంగారం ఉచితంగా ఇచ్చారు. ఇది మంచిదో కాదో చెక్ చేసుకుని డబ్బులతో రావాలని చెప్పారు. ఆ శాంపిల్ బంగారాన్ని మేళ్లచెర్వుకు తీసుకువచ్చి పరీక్షించగా మేలిమి బంగారం అని తేలింది.
తక్కువ ధరకు బంగారం లభిస్తుందనే ఆశతో శంభిరెడ్డి, వారం రోజుల క్రితం మరోసారి అనంతపురం జిల్లాకు వెళ్లి రూ.3 లక్షలతో బంగారం కొనుగోలు చేశాడు. ఆ బంగారాన్ని మేళ్లచెరువులో పరీక్షించగా నకిలీ బంగారంగా తేలింది. దీంతో మోసపోయానంటూ శంభిరెడ్డి లబోదిబోమంటూ ముగ్గురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మేళ్లచెరువు ఎస్ఐ పరమేష్ తెలిపారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





