November 24, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: మంత్రాల పేరుతో మాయ చేస్తున్న కేటుగాళ్లు.. దొంగ స్వాముల ఇళ్ళపై ఏకకాలంలో పోలీసుల దాడులు

మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దొంగ స్వాముల భరతం పట్టారు పోలీసులు. ఏకంగా బైండోవర్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు సీరియస్ యాక్షన్ షురూ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదేశాలు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దాడి చేశారు. దొంగ స్వాములు, బాబాల ఇండ్లు, స్థలాలపై ఏకకాలం లో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. 11 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా,  9 మందిని బైండోవర్ చేశారు.

కేసులు నమోదు అయిన బాబాలు, స్వాముల పేర్లను పోలీసులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా జరిపిన దాడుల్లో జవ్వాజి ధనుంజయ్, అంబటి నర్సయ్య, బొమ్మేళ మల్లేశం, జాగిరి పర్శరాములు, గొట్టే రామస్వామి, వెంకట రాములు, శ్రీనివాస్, సురేందర్, శ్రీకాంత్, ప్రవీణ్, కడమంచి రామస్వామిలపై కేసులు నమోదు చేశారు. మిగితా 9 మంది గొట్టే రవీందర్, రామకృష్ణ, దయాకర్, మహమ్మద్ మజర్, అన్నలదాస్ దశరథం, కంపెళ్లి మహేష్, నడికుల నాగేంద్ర, టేకు నర్సయ్య, కడమంచి దుర్గయ్యలను ఎమ్మార్వో ముందు బైండోవర్ చేశారు.

ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగిడుతున్న పరిస్థితుల్లో ప్రజలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవలే తప్ప మూఢనమ్మకాలు , చేతబడి, మంత్రాలు, నమ్మి ప్రజలు  ఇబ్బందుల్లోకి వెళ్లవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ముఖ్యంగా ఇలాంటివి నమ్మడం వల్ల ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు. ప్రతి వ్యక్తి చదువుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనారోగ్యం పాలైన వ్యక్తులు భూత వైద్యులను ఆశ్రయించకుండా ఆస్పత్రిలో చేరి  వైద్యం చేయించుకోవాలని కోరారు. మంత్రాలు, మూఢనమ్మకాల నెపంతో దాడులకు, ఇతరత్రా హింసకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిరక్షరాస్యులతో పాటు కొంతమంది చదువుకున్న వారు కూడా ఈ మూఢనమ్మకాలకు లోనై ఆర్థికంగా, మానసికంగా  ఎంతో నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో జిల్లా పోలీస్ శాఖ తరుపున , జన విజ్ఞాన వేదిక ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. చేతబడి, మంత్రాల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ  సూచించారు.

Also read

Related posts

Share via