November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

ప్రైవేటు పాఠశాల వద్ద ఆందోళన ఉద్రిక్తం



కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాల వద్ద మంగళవారం జరిగిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మూడు రోజుల క్రితం యూకేజీ చదువుతున్న చిన్నారితో వ్యాయామ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు.

నిరసనకు దిగిన తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాలు పాఠశాలపై ఓ వర్గం రాళ్లదాడి ముగ్గురు పోలీసులకు గాయాలు… లాఠీఛార్జి


కామారెడ్డి పట్టణం: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాల వద్ద మంగళవారం జరిగిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మూడు రోజుల క్రితం యూకేజీ చదువుతున్న చిన్నారితో వ్యాయామ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఉపాధ్యాయుడితోపాటు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనలు ఓ వర్గానికి చెందిన వారు భారీ సంఖ్యలో ప్రవేశించిన తరువాత ఉద్రిక్తంగా మారాయి. వారు పాఠశాలపైకి రాళ్లు విసరడంతోపాటు భవనంలోకి ప్రవేశించి కిటికీలు, కుర్చీలు ధ్వంసం చేశారు. రాళ్ల దాడిలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తల, చెవి కింద గాయాలు కాగా ఏఆర్ హెడ్కానిస్టేబుల్ నజీరుద్దీను కాలు విరిగింది. పట్టణ ఎస్సై రాజారాం సైతం గాయాలతో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జి చేసి పాఠశాల ప్రాంగణం నుంచి బయటకు పంపించారు. అనంతరం ఆదోళనకారులు పట్టణంలో రోడ్లపైకి చేరి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. నిజాంసాగర్ చౌరస్తాతోపాటు రైల్వేబ్రిడ్జి పైన బైఠాయించడంతో పోలీసులు చేరుకుని తిరిగి లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఎస్పీ సింధూశర్మ, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) డి.శ్రీనివాస్ రెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. పాఠశాల నిర్వాహకులతోపాటు డీఈవో రాజు, ఎంఈవో ఎల్లయ్యలపై చేసిన ఆరోపణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Also read

Related posts

Share via