హైదరాబాద్/మేడ్చల్: మల్కాజ్గరిలో కాల్పుల కలకలం రేగింది. మూడు నెలల క్రితం భార్యను హత్య చేసేందుకు స్కెచ్ పోలీసులకు చిక్కిన ఓ భర్త.. చివరకు తన పథకాన్ని అమలు చేశాడు. మరో వ్యక్తి సాయంతో తన రెండో భార్యను తుపాకీతో కాల్చి హతమార్చాడు. బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం, మల్కాజ్గరి మారుతీనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్కుమార్కు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. విడాకులిచ్చి ఆమె సోదరిని మరో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని అరుణ్ అనుమానాలు పెంచుకోసాగాడు. ఈ కారణంగా దంపతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో.. ఆమె దూరంగా ఉండే ప్రయత్నం చేసింది.
దీంతో.. భార్యను ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో అరుణ్ ముందుగానే హత్య ప్రణాళిక రూపొందించాడు. ఈ ఏడాది మార్చిలోనే బిహార్ నుంచి అక్రమంగా దేశవాళీ తుపాకీ, బుల్లెట్లు తెప్పించుకుని భార్యను చంపేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు, తుపాకీ పేల్చడంపై ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే పక్కా సమాచారంతో చార్మినార్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అరుణ్ హత్యాయత్నం విఫలమై వార్తల్లోకి ఎక్కింది.
ఆయుధ చట్టం కేసుతో కటకటాల పాలైన అరుణ్.. బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే ఆ తర్వాత కూడా అతడి ఆలోచన మారలేదు. ఈ తెల్లవారుజామున మాట్లాడుకుందామని భార్యను బయటకు పిలిచిన అరుణ్, మరో వ్యక్తితో కలిసి ఆమెపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లతో కాల్పులు జరపడంతో.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పుల అనంతరం నిందితులు పరారయ్యారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని తన స్నేహితుల ద్వారా అరుణ్ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులకు లీడ్ దొరికింది. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





