SGSTV NEWS
Spiritual

ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడు? పురుషోత్తముడు తన సోదర, సోదరితో కలిసి ఎప్పుడు పుర వీధుల్లో దర్శనం ఇవ్వనున్నాడంటే..

దేశ విదేశాల్లో ఉన్న కృష్ణ భక్తులు ఏడాది పాటు ఎదురుచూసే పండగ పూరి జగన్నాథుడి రథయాత్ర. ఒడిశా లో ఉన్న పూరి నగరంలో జరుపుకునే వార్షిక పండుగ. ఈ పండుగ విష్ణువు అవతారమైన జగన్నాథుడికి.. అతని అన్నయ్య బలభద్రుడికి, సోదరి సుభద్రకు అంకితం చేయబడింది. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా సరే జగన్నాథుడి రథయాత్రని దర్శించుకోవాలని భావిస్తాడు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది జగన్నాథుని రథయాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ప్రాముఖ్యత తెలుసుకోండి..



సప్తమోక్షపురములలో ఒకటిగా, చార్ ధామ్ లో ప్రధానమైనదిగా చెప్పబడుతున్న పురుషోత్తమ క్షేత్రం ఒడిశాలోని పూరి క్షేత్రంలో ఆషాఢ మాసం శుద్ధ విదియ రోజున సుభద్రా బలభద్రా సుదర్శన సహిత జగన్నాథ స్వామివారి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది ఈ పవిత్ర ప్రయాణం శుక్రవారం, జూన్ 27వ తేదీ 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ రథయాత్ర ఒడిశాకే కాదు దేశ విదేశాల్లో ఉన్న లక్షలాది కృష్ణ భక్తులకు ఒక ముఖ్యమైన మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమం. ప్రతీ సంవత్సరమూ అత్యంత వైభవంగా జరిగే ఈ రథయాత్రలో అత్యద్భుతంగా అలంకరించిన రథంలో దివ్యమూర్తుల విగ్రహాల్ని ప్రతిష్ఠించి నృత్యగానాలతో పురవీథుల్లో ఊరేగిస్తారు. భక్తులు ఆనందపారవశ్యంతో రథయాత్రను తిలకిస్తారువేలాది మంది భక్తులు ఈ రథాలను తాళ్లతో లాగుతారు.

జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత జగన్నాథుని రథయాత్రకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున జగన్నాథుడు తన భక్తులకు దర్శనం ఇవ్వడానికి భారీ రథాలపై నగర పర్యటనకు వెళతాడు. ఈ ప్రయాణంలో జగన్నాథుడు, ఆయన అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్ర మూడు వేర్వేరు రథాలపై స్వారీ చేస్తూ గుండిచా ఆలయానికి వెళతారు. గుండిచా ఆలయం జగన్నాథుని మేనత్త ఇల్లు అని నమ్ముతారు. జగన్నాథుడు ఇక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడు. జగన్నాథుని ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సాంస్కృతిక సంప్రదాయాల అద్భుతమైన సంగమం. ఇది లక్షలాది మంది భక్తులను ఒకచోట చేర్చి, దేవునికి దగ్గరయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది.

జగన్నాథ రథయాత్రకు సంబంధించిన అనేక మత విశ్వాసాలు.. ఈ రథయాత్రలో పాల్గొనడం ద్వారా లేదా దేవుని రథాన్ని చూడటం ద్వారా.. లేదా రథాన్ని లాగడం ద్వారా మోక్షం లభిస్తుందని, తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.




కోరికల నెరవేరుతాయని నమ్మకం. రథాన్ని లాగడం లేదా రథం వెళ్ళే మార్గాన్ని ఊడ్చడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

హిందువుల ఐక్యతకు చిహ్నం ఈ రథయాత్ర ఊరేగింపు సమాజ ఐక్యత, సోదరభావానికి చిహ్నం. దీనిలో అన్ని తరగతులు , కులాల ప్రజలు కలిసి భగవంతుని రథాన్ని లాగుతారు.

రథయాత్ర ప్రక్రియ రథయాత్ర కోసం జగన్నాథుడు, బలభద్రుడు ,సుభద్రల కోసం మూడు భారీ రథాలను నిర్మిస్తారు. ఈ రథాలను ‘దారు’ అని పిలువబడే పవిత్రమైన వేప కలపతో తయారు చేస్తారు. రథాలను ఆకర్షణీయంగా అలంకరిస్తారు. వేలాది మంది భక్తులు ఈ రథాలను తాళ్లతో లాగుతారు.

ఈ ప్రయాణం జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమై గుండిచా ఆలయం వరకు వెళుతుంది. ఈ సమయంలో, లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం దారి పొడవునా గుమిగూడతారు. భగవంతుడు గుండిచా ఆలయంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ తర్వాత ‘బహుద యాత్ర’లో జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తాడు.

ఈ సంవత్సరం రథయాత్ర ఎప్పుడు?
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసం శుద్ధ విదియ తిథి జూన్ 26, 2025న మధ్యాహ్నం 1:24 గంటలకు ప్రారంభమై జూన్ 27, 2025న ఉదయం 11:19 గంటలకు ముగుస్తుంది. ఉదయ తేదీ ప్రకారం, రథయాత్ర ప్రధాన కార్యక్రమం జూన్ 27న జరుగుతుంది

Related posts

Share this