మాస ఫలాలు (మే 1-31, 2025): మేష రాశి వారికి ఈ నెలంతా ఇంటా బయటా సుఖ సంతోషాలకు లోటుండదు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారి ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగపరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. ఒకటి రెండు వ్యక్తి గత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మే నెల మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, కుజ, రవి గ్రహాల అనుకూలత వల్ల దాదాపు ఈ నెలంతా ఇంటా బయటా సుఖ సంతోషాలకు లోటుండదు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ధన స్థానంలో భాగ్యాధిపతి గురువు బాగా బలంగా ఉన్న కారణంగా ఈ రాశివారికి ఆదాయం వృద్ధి ఉంటూనే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదా అధికారం లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం చాలా వరకు హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు. రోజూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఈ నెలాఖరు వరకు రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలోనే కొనసాగుతున్నందువల్ల ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. నెల మధ్య నుంచి రవి, కుజ గ్రహాలు మరింత అనుకూలంగా మారుతున్నందు వల్ల కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగి పోతాయి. ఈ రాశివారు ప్రతి రోజూ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతి బుధుడు ఈ నెల 7 వరకూ దశమ స్థానంలోనూ, ఆ తర్వాత నుంచి లాభ స్థానంలోనూ కొనసాగుతున్నందువల్ల ఏ ప్రయత్నమైనా సానుకూలపడుతుంది. ఉద్యోగపరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తి గత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే, వ్యయ స్థానంలో గురువు సంచారం వల్ల శుభ కార్యాల మీద ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తి అవుతాయి. కుటుంబ జీవితంలో బాధ్యతలు పెరగడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదించే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవ హారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తరచూ గణపతి స్తోత్రాన్ని పఠించడం చాలా అవసరం
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆదాయ వృద్ధి విషయంలో కూడా అనేక అవకాశాలు అంది వస్తాయి. ఇంత వరకూ పడిన కొన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. బంధుమిత్రుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తరచూ స్కంద స్తోత్రాన్ని పఠించడం వల్ల కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి ప్రస్తుతం భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టి ఉండడం, 14 తర్వాత దశమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అనుకూలతలు, శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి, ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. గతంలో మీ సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ భాగస్వామితో సానుకూలంగా గడిచిపోతుంది. శివార్చన చేయించడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ నెల 25 వరకూ కొనసాగుతున్న గురువు వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. మొత్తం మీద వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం అవసరం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ప్రతి రోజూ ఉదయం ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల ప్రతి ప్రయత్నంలోనూ ఘన విజయాలు కలుగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ నెలాఖరు వరకు రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛలో ఉండడంతో పాటు, గురు గ్రహంతో పరివర్తన చెందినందువల్ల ఈ నెలంతా జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రముఖులతో ఆధ్మాత్మిక సేవా కార్య క్రమాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభించే అవకాశం ఉంది. ఉద్యోగుల అదనపు ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు మంచి ఆపర్లు అందుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. దుర్గా స్తోత్రం పఠనం వల్ల మేలు కలుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఈ రాశికి ఈ నెల 25 వరకు సప్తమ స్థానంలో గురువు, ఈ నెలంతా భాగ్య స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల నెలంతా ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కుటుం బంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నెల 14 నుంచి రవి కూడా సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబం మీదా, బంధుమిత్రుల మీదా వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇతరత్రా కూడా ధన నష్టానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి. తరచూ హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
చతుర్థ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి వల్ల ఈ రాశివారికి ఈ నెలంతా హ్యాపీగా గడిచిపోతుంది కానీ, 18 తర్వాత నుంచి మరింత ఉన్నతంగా సాగిపోయే అవకాశం ఉంది. ఈ నెల ద్వితీయార్థంలో ఈ రాశివారికి పదోన్నతులు లభించే సూచనలున్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం తప్పకుండా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఏ పని తలపెట్టినా సఫ లమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు విదే శాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. సుందరకాండ పారాయణ వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో సంచారం చేయడం, ఈ నెలాఖరు వరకు ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం, పంచమ స్థానంలో గురువు సంచారం కొనసాగడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టి లాభాలు గడించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల పరిష్కారానికి అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరగవచ్చు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ నెలాఖరువరకు శుక్రుడు ధన స్థానంలో ఉచ్ఛలో ఉండడం, గురువుతో పరివర్తన కొనసాగడం, రాశ్యధిపతి శని కూడా శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. బాకీలన్నీ వసూలవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవ కాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రతి పనీ, ప్రతి వ్యవహారమూ నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. శివాలయంలో శనికి దీపం వెలిగించడం వల్ల మేలు కలుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ నెలాఖరు వరకు ఈ రాశిలో శనితో పాటు ఉచ్ఛ శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోయి, శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్లు, ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పంచమంలో కుజుడి అనుకూలత వల్ల ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఏ ప్రయత్నం చేసినా సత్ఫలితాలనిస్తుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంతో ఆలయాల్ని సందర్శిస్తారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. లలితా సహస్ర నామ స్తోత్రం పఠించడం మంచిది.
Also read
- ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
- రూ.6 వేల కోట్ల భారీ కుంభకోణం.. UCO బ్యాంక్ డైరెక్టర్ అరెస్టు
- నేటి జాతకములు…20 మే, 2025
- విజయవాడ: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని..
- ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..