April 16, 2025
SGSTV NEWS
Astro TipsSpiritual

Shani Planet: ఈయన భక్తులను ఏలినాటి శని కూడా టచ్ చేయలేదు.. జాతకం ఎలా ఉన్నా వీరికి మాత్రం రాజభోగాలే



అంజనేయుడు, లేదా హనుమంతుడు, లక్షలాది మంది హృదయాలలో ఆరాధనీయుడిగా నిలిచిన గొప్ప రామభక్తుడు. అపారమైన శక్తి, నిస్వార్థ సేవ, అచంచలమైన భక్తి ప్రతీకగా ఆయన గుర్తింపబడతాడు. రామాయణంలో రాముని సేవలో ఆయన చేసిన కార్యాలు, జీవన విలువలను నేర్పించే గొప్ప పాఠాలుగా నిలుస్తాయి. అయితే, కలియుగంలో జీవులను ముప్పు తిప్పలు పెట్టే దశ శని దశ. హనుమాన్ భక్తులను మాత్రం ఈ శనైశ్చరుడు బాధించడట. కారణం ఇదే..



లంకాపురిలో రావణుడితో భీకర యుద్ధం జరుగుతున్న వేళ, రావణుడి సోదరుడైన మైరావణుడు మాయాశక్తులతో లక్ష్మణుడిని, మరికొంతమంది వానరులను గాయపరిచి మూర్ఛిల్లజేస్తాడు. ఏం చేయాలో తోచక శ్రీరాముడు దిగులుగా ఉన్న సమయంలో, హనుమంతుడు తన సహాయం అందించడానికి సిద్ధంగా, రాముడి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తుంటాడు. రాముడు వెంటనే మునుల సూచన మేరకు సంజీవిని పర్వతాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ క్షణమే హనుమంతుడు వాయువేగంతో ఆకాశమార్గాన బయలుదేరతాడు.

ఇది గమనించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు ఎలాగైనా హనుమంతుడిని అడ్డుకోవాలని నిశ్చయించుకుంటాడు. సంజీవిని మూలికలను తెస్తే మూర్ఛపోయిన వారందరూ తిరిగి శక్తివంతులు అవుతారని, ఆ తర్వాత వారితో పోరాడటం అసాధ్యమని గ్రహిస్తాడు. దుష్ట బుద్ధితో, నవగ్రహాలలో భయంకరమైనవాడుగా పేరుగాంచిన శనిని హనుమంతుడికి అడ్డంకిగా నిలబడమని ఆజ్ఞాపిస్తాడు. గురువు మాట వినగానే శనీశ్వరుడు తన శక్తులన్నిటినీ హనుమంతుడిపై ప్రయోగించడానికి సిద్ధమవుతాడు.

ఇంతలో, హనుమంతుడు వెళ్ళిన చోటల్లా సంజీవిని మొక్క కోసం వెతుకుతాడు. అది ఎక్కడ ఉందో తెలియక, ఆ పర్వతం మొత్తాన్ని పెకలించి ఆకాశ మార్గంలో తిరిగి వస్తుంటాడు. ఇది చూసిన శని, హనుమంతుడిని మధ్యలో ఆపి, రావణాసురుడు పంపగా వచ్చానని, ఈ పర్వతాన్ని తీసుకువెళ్లడానికి వీల్లేదని వాదిస్తాడు. ఈ మాటలకు హనుమంతుడికి తీవ్రమైన కోపం వస్తుంది. కానీ, తన ఆవేశాన్ని నియంత్రించుకుంటూ రామనామ జపం చేస్తూ తన పాదాలతో శని ఊపిరి ఆడకుండా తొక్కిపెడతాడు. హనుమంతుడి యొక్క శక్తిని తెలుసుకున్న శని, చివరకు తాను తప్పుగా అడ్డుకున్నానని క్షమాపణ కోరుతూ తనను విడిచిపెట్టమని వేడుకుంటాడు. శని పడుతున్న బాధను చూసి జాలిపడిన హనుమంతుడు, కొన్ని షరతులు విధిస్తూ అతడిని విడిచిపెడతాడు. ప్రతిరోజూ మూడు పూటలా రామనామ జపం చేసేవారికి, తనను నిత్యం పూజించేవారికి ఎప్పటికీ బాధలు కలిగించకూడదని, వారిపై కనీసం తన దృష్టి కూడా పడకూడదని శని భయపడేలా ఆజ్ఞాపిస్తాడు.

శనీశ్వరుడు ఆ షరతులకు అంగీకారం తెలుపుతూ, ఒక కోరిక కోరతాడు. హనుమంతుడి దేవాలయాలు ఉన్న చోట తన విగ్రహం కూడా ఉండాలని, ప్రతి శనివారం తనకూ అభిషేకాలు జరిగేలా చూడాలని, అప్పుడే భక్తుల పట్ల తాను దయతో ఉంటానని విన్నవిస్తాడు. హనుమంతుడు శని కోరికను మన్నించి, అతడిని ఆశీర్వదించి పంపిస్తాడు. అప్పటి నుండి, శని దశ నడుస్తున్నవారు, సాధారణ భక్తులు కూడా ప్రతి శనివారం ఆంజనేయస్వామికి అభిషేకాలు, పూజలు చేస్తారు. అలా చేస్తే శని మహారాజు అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

Also read

Related posts

Share via