Adhika Jyeshtha Pournami 2026: అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఈసారి మే 31 ఆదివారం రావడం వల్ల ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పౌర్ణమి శుభ సమయం కొనసాగనుంది. ఈ పవిత్ర సమయంలో పూజలు, వ్రతాలు, దానాలు చేస్తే అనేక రెట్లు పుణ్యఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
Jyeshtha Purnima: హిందూ ధర్మశాస్త్రంలో పౌర్ణమి తిథికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈసారి జ్యేష్ఠమాస పౌర్ణమి అధిక మాసంతో కలసి రావడం వల్ల దీనికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏర్పడింది. మే 31, ఆదివారం జరగనున్న అధిక జ్యేష్ఠ పౌర్ణమి భక్తులకు అత్యంత శుభప్రదంగా భావిస్తున్నారు. సూర్యభగవానుడికి ప్రీతికరమైన ఆదివారం రోజునే ఈ పౌర్ణమి రావడం విశేషంగా చెప్పబడుతోంది. ఈ పవిత్ర తిథి శుభ సమయం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో చేసే పూజలు, వ్రతాలు, దానాలు అనేక రెట్లు పుణ్యఫలితాలను ఇస్తాయని విశ్వాసం.
అధిక జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేయాల్సిన పూజలు
పౌర్ణమి రోజున చాలామంది భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే పరమేశ్వరునికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు. లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామం, సుందరకాండ, రామాయణ పారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. అదనంగా నవగ్రహ శాంతి హోమం, వినాయక హోమం వంటి శాంతి క్రతువులు నిర్వహిస్తే కుటుంబంలో శాంతి, సౌఖ్యం పెరుగుతాయని నమ్మకం.
ఈ రోజున చేయదగిన దానాలు
ఆదివారం రోజున పౌర్ణమి రావడం వల్ల తెలుపు రంగు వస్త్రాలను దానం చేయడం ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని చెబుతారు. బియ్యం, పెరుగు, చక్కెర వంటి పదార్థాలను అవసరమైన వారికి దానం చేయడం శ్రేయస్కరం. వేసవి కాలం కావడంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందించడం కూడా మహా పుణ్యకార్యంగా భావిస్తారు.
పండ్లు, డ్రైఫ్రూట్స్, మట్టికుండలు, పండితులకు దక్షిణలు ఇవ్వడం మంచిదని అంటారు. పేదవారికి వస్త్రదానం, అన్నదానం చేయడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అలాగే నెయ్యితో దీపారాధన చేయడం, ఆవులకు పశుగ్రాసం వేయడం, నల్ల చీమలకు చక్కెర లేదా బెల్లం పెట్టడం వంటి చిన్న సేవలు కూడా శుభఫలితాలను ఇస్తాయని చెబుతారు.
నదీస్నానం – ఆలయ దర్శనాల ప్రాముఖ్యత
పౌర్ణమి రోజున పవిత్ర నదీస్నానం చేయడం అత్యంత మంగళకరంగా భావిస్తారు. ఆ రోజు శివాలయాలు, విష్ణు ఆలయాలను దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారికి కుంకుమార్చనలు చేయడం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా వంటి స్తోత్రాలను పఠించడం కూడా ఎంతో శ్రేయస్కరంగా పేర్కొంటారు.
ఈ విధంగా అధిక జ్యేష్ఠ పౌర్ణమిని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
