శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానమే గరుడపురాణం. అయితే టిబెటిన్ బుక్ ఆఫ్ ది డెడ్ కూడా సేమ్ టు సేమ్ గరుడపురాణమే అంటారు..పోలికలు ఏంటంటే..
Garuda Purana and the Tibetan Book of the Dead: మరణం అంటే జీవితానికి ముగింపు కాదు..అది మహా పరివర్తన, ఆత్మ సాగించే యాత్ర. గరుడపురాణం ప్రేతఖండం , టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్ ఈ రెండూ ఈ రహస్యాన్ని వివరిస్తాయి. ఈ రెండు గ్రంథాలు వేర్వేరు సంస్కృతులు, సంప్రదాయాల నుంచి వచ్చినప్పటికీ ఆత్మయాత్ర, కర్మ , మధ్యస్థ స్థితి, మోక్షం వీటి గురించి లోతైన సారూప్యతలు వివరిస్తాయి. మనకు జీవితం, మరణం, పునర్జన్మల గురించి గొప్ప జ్ఞానాన్ని అందిస్తాయి.
గరుడ పురాణం హిందువులకు సంబంధించిన మతగ్రంధం – గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానాలే గరుడ పురాణం. శరీరం నుంచి ఆత్మ విడిపోవడం, యమదూతలు, వైతరణీ నది, యమలోకంలో శిక్షలు, స్వర్గ నరకాలు, కర్మల ఫలితాలు, పునర్జన్మ.. ఇలా పుట్టుక నుంచి మరణం, పునర్జన్మ వరకూ అన్నీ వివరిస్తుంది. మొదటి 13 రోజులు ఆత్మ శరీరం చుట్టూ తిరుగుతూ పిండదానాల ద్వారా సహాయం పొందుతారు.
ఇక టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్…పద్మసంభవుడు రచించిన ఈ గ్రంథంలో మరణానంతరం ఆత్మ/చైతన్యానికి మార్గదర్శకం. మరణ సమయం, దేవతల దర్శనాలు, పునర్జన్మ గురించి వివరిస్తుంది. ఇది 49 రోజుల యాత్రగా చెబుతుంది.
ఈ రెండు పుస్తకాల్లోనూ మరణానంతరం ఆత్మ ప్రయాణం గురించి ఆసక్తికరమైన పోలికలు ఉన్నాయి.
మధ్యంతర స్థితి
రెండు గ్రంథాలు కూడా మరణం తర్వాత, పునర్జన్మకు ముందు మధ్యంతర స్థితి ఉంటుందని చెబుతాయి. టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్ దీనిని బార్డో అని పిలుస్తుంది. ఇక గరుడ పురాణం ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత యమలోకానికి చేరుకునేముందు సాగించే సుదీర్ఘ ప్రయాణాన్ని వివిధ దశలను వివరిస్తుంది.
కర్మ సిద్ధాంతం
ఈ రెండు గ్రంథాలకు కర్మ అనేది ప్రధానాంశం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన పనులు, ఆలోచనలు మరియు ఉద్దేశాలే వారి మరణానంతర ప్రయాణాన్ని నిర్ణయిస్తాయని రెండు గ్రంథాలు వివరిస్తాయి. గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు , చిత్రగుప్తుడు ఓ వ్యక్తి పాప పుణ్యాలను లెక్కగట్టి తీర్పునిస్తారు. ఇక టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్ ప్రకారం ఓ వ్యక్తి చేతనపై ఉన్న కర్మ ముద్రలు వారు బోర్డోలో ఎదుర్కొనే అనుభవాలను ప్రభావితం చేస్తాయి
పునర్జన్మ చక్రం
జీవితం పుట్టుక, మరణం, పునర్జన్మల చక్రం అని రెండు గ్రంథాలు వివరిస్తాయి. మరణం తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా తిరిగి మానవ రూపంలోనో, జంతువుగానో , ఇతర లోకాల్లోనో జన్మిస్తుందని ఇందులో ఉంది.
మోక్షం లేదా విముక్తి
జన్మ మృత్యు చక్రం నుంచి విముక్తి పొందడమే అంతిమ లక్ష్యం అంటాయి రెండు గ్రంథాలు. టిబెటన్ సంప్రదాయం దీనిని ధర్మకాయ స్థితిగా అభివర్ణిస్తుంది. ఇది వాస్తవికత భ్రమలను గుర్తించడం ద్వారా లభిస్తుంది. గరుడపురాణం దీనిని మోక్షం లేదా ముక్తి అని పిలుస్తుంది.
మరణ సమయ అవగాహన
మరణించే సమయంలో ఓ వ్యక్తి మానసిక స్థితి, అవగాహన..తన తదుపరి ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయని రెండు గ్రంథాలు చెబుతున్నాయి.
అందుకే మరణసమయంలో ప్రశాంతంగా ఉండడం, దైవ చింతన కలిగి ఉండడం ముఖ్యమని సూచిస్తారు ఆధ్యాత్మికవేత్తలు.
ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం
ఈ రెండు గ్రంథాలు మరణించిన వారికి మాత్రమే కాదు జీవించి ఉన్నవారికి కూడా మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఈ రెండు గ్రంథాలు విభిన్న సంస్కృతుల నుంచి వచ్చినప్పటికీ మరణం అనేది పరివర్తన మాత్రమే అని, మన కర్మలే మన భవిష్యత్ ను నిర్ణయిస్తాయని ఏకాభి
మరణం భయపడాల్సినది కాదు జ్ఞానం పొందాల్సిన అవకాశం..జ్ఞానంతో జీవించండి, విముక్తి వైపు పయనించండి. మరిన్ని వివరాల కోసం మూల గ్రంథాలు పఠించండి.
