కర్నూలు నగరానికి చెందిన ఓ ఆటోడ్రైవర్, మరో ట్రాక్టర్ డ్రైవర్ కలిసి 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించి తల్లిని చేసిన దారుణ ఉదంతం సోమవారం వెలుగుచూసింది. నగర శివారులోని ఒక గ్రామానికి చెందిన భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివిస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలికను రోజూ ఆటోలో పాఠశాలకు పంపేవారు. ఆటోడ్రైవర్ బోయ్ మహేంద్ర ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ అయిన అతని మిత్రుడు తెలుగు శివకుమార్ కూడా ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో భయపడిన బాధితురాలు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితులిద్దరూ తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఒంట్లో నలతగా కనిపించడంతో తల్లిదండ్రులు ఈనెల 28న ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాధితురాలి తల్లిదండ్రులను విచారించి వివరాలు రాబట్టారు. నిందితులు బాలిక కుటుంబంపై బెదిరింపులకు పాల్పడినట్లు నిరూపించే సంభాషణల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బాలిక జరిగిన దారుణాన్ని చెప్పే పరిస్థితిలో లేకపోవడంతో సోమవారం రాత్రి వరకూ కేసు నమోదు చేయలేదు. ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు కావడం, నిందితుల నుంచి తమకు ముప్పు ఉంటుందని భయపడుతుండటంతో బాధితురాలిని, నవజాత శిశువును స్త్రీ, శిశు సంక్షేమశాఖ సంరక్షణలో ఉంచాలని నిర్ణయించారు.
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





