కాకినాడ రూరల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో నిందితుడైన రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాధిక్ ఖాన్ నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసులో సాధిక్ ఖాన్ను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు.. జగదీశ్వరరెడ్డి హత్యలో కీలక విషయాలతో పాటు నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణాలు రాబట్టగలిగారు. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి జూలై 2న మృతి చెందగా, 44 రోజలకే ఆగస్టు 16న నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.
జగదీశ్వరరెడ్డి హత్య తరువాత నూకరాజు కుటుంబంపైన, సౌజన్యపైన సాధిక్ ఖాన్ వేధింపులు మితిమీరిపోయాయి. మతం మారాలని, పెళ్ళి చేసుకుంటానని చెబుతూనే.. ఆస్తుల కోసం ఆమెను కట్టడి చేయడం ప్రారంభించాడు. సౌజన్య పేరిట ఉన్న ఆస్తులతో పాటు బ్యాంక్ లాకర్లలో బంగారం పైనా కన్నేశాడు. సౌజన్య లాకర్లో ఉన్న బంగారాన్ని ఆగస్టు 14న ఒక ప్రైవేట్ బ్యాంక్లో కుదవపెట్టి రూ.40 లక్షలు తీసుకుని అప్పులు తీర్చేసింది. ఇది తెలుసుకున్న సాధిక్ ఉగ్రరూపం దాల్చాడు.
తనకు తెలియకుండా అప్పులు ఎలా తీరుస్తావంటూ గొడవకు దిగాడు. బంగారం, ఆస్తులు తనకు కావాలని, లాకర్లు తెరవడానికి వీల్లేదని ఒత్తిడి తేవడంతో పాటు మాట వినకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించారు. జగదీశ్వరరెడ్డి హత్యలో సౌజన్య పాత్ర ఉందని నూకరాజుకు చెప్పేస్తానని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపులు, ఒత్తిడి భరించలేక రెండో రోజు రాత్రి వారు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. జగదీశ్వరరెడ్డి హత్యతో పాటు నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ కారణమని కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం.
ముగిసిన కస్టడీ.. రాజమండ్రి జైలుకు తరలింపు
సాధిక్ ఖాన్ కస్టడీ ముగియడంతో అతన్ని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రెండు రోజుల కస్టడీలో జగదీశ్వరరెడ్డి హత్యకు వినియోగించిన రసాయనం, సైనేడ్ గురించి, వాటి వినియోగంతో పాటు ఆస్తుల కోసం నూకరాజు, సౌజన్యలపై ఒత్తిడి, వేధింపులు, బాక్ మెయిల్ తదితర అంశాలపై కొంతమేరకు సమాధానాలు రాబట్టినట్టు సమాచారం. శనివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర ముందు హాజరుపరచి, అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలులో అప్పగించినట్లు సర్పవరం సీఐ ప్రకాష్ చెప్పారు.
Also read
- తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026





