SGSTV NEWS online
Andhra PradeshCrime

Rajahmundry:కల్తీ పాలు కేసులో మరో మృతి… మృతుల సంఖ్య 17కి పెరుగుదల.


Rajahmundry:ఇటీవల కాలంలో ఏపీలోని రాజమండ్రి కల్తీపాల విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరొకరు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఫిబ్రవరిలో వెలుగుచూసిన కల్తీపాల ఘటన ఇంకా బాధితులను వెంటాడుతూనే ఉంది. నిన్న రాజేంద్రనగర్‌కు చెందిన పిచ్చుక నాగేశ్వరరావు(72) అనే వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గత నెల16న కల్తీపాలు తాగిన ఆయన, అప్పటి నుంచి తీవ్ర అస్వస్థతతో కిడ్నీలు దెబ్బతిని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

అతడిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ మృతితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 17కి చేరింది. ఈ ఘటన రాజమండ్రిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి ముగ్గురు బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఫోరెన్సిక్, ల్యాబ్ రిపోర్టుల ప్రకారం.. ఈ పాలలో ‘ఇథిలీన్ గ్లైకాల్’ (Ethylene Glycol) అనే అత్యంత విషపూరితమైన రసాయనం కలిసినట్లు అధికారులు నిర్ధారించారు.

పాలను నిల్వ చేసే ఫ్రిజర్‌లో గ్లైకాల్ లీక్ అయ్యి పాల క్యాన్లలో కలవడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషపూరిత పాలు తాగిన వారిలో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు ఉండటం విశేషం. వారిలో అనూరియా, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వంటి తీవ్ర లక్షణాలు కనిపించాయి. ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తున్నప్పటికీ, చాలామంది ప్రాణాలు కాపాడలేకపోవడం ఈ రసాయనం తీవ్రత ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఈ ఘటన సంబంధించిన కేసులో బాధ్యుడైన పాల వ్యాపారి అడ్డాల గణేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనధికారికంగా ‘వరలక్ష్మి డైరీ’ పేరిట పాలను సేకరించి పంపిణీ చేస్తున్న ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read

Related posts