మైనర్ బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో తమిళ జూనియర్ నటుడు భారతి కన్నన్, డీఎంకే నేత రమేష్‌తో పాటు ఐదుగురిని చెన్నై పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. బాలిక నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడి లక్షల్లో సంపాదించినట్లు పోలీసులు తెలిపారు
9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించిన కేసులో తమిళ సినీ జూనియర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు భారతి కన్నన్ (63), డీఎంకే కార్యకర్త రమేష్ (40) ఉన్నారు. వీరితో సహా మొత్తం ఐదుగురిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బాలిక నిస్సహాయతను ఆసరా చేసుకుని ఈ ముఠా వ్యభిచార కూపంలోకి నెట్టినట్టు దర్యాప్తులో తేలింది.
బాలికతో వ్యభిచారం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చెన్నైలోని కోయంబేడు వంద అడుగుల రోడ్డులోని ఒక వసతి గృహంలో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న 15ఏళ్ల మైనర్ బాలిక పోలీసులకు పట్టుబడింది.
బాలికను విచారించగా, ఆమె తండ్రి మరణించడంతో తల్లి మరొకరిని వివాహం చేసుకుని వెళ్లిపోయిందని, దీంతో ఆమె తన తల్లి స్నేహితురాలైన కేకే నగర్‌కు చెందిన క్లబ్ డ్యాన్సర్ పూంగొడి వద్ద ఆశ్రయం పొందింది. ఈ అదును చూసుకుని పూంగొడి, ఆమె మేనకోడలు ఐశ్వర్య కలిసి బాలికకు డబ్బు, విలాసవంతమైన జీవితం ఆశ చూపి వ్యభిచారంలోకి దింపారు. ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు.
ఈ మొత్తం వ్యవహారంలో హాస్యనటుడు భారతి కన్నన్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. పూంగొడి, ఐశ్వర్యతో కలిసి భారతి కన్నన్ బాలికతో వ్యభిచారం చేయించి, లక్షల్లో డబ్బు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు
ఈ నేపథ్యంలో, పోలీసులు మొదట పూంగొడి, ఐశ్వర్యలను అరెస్టు చేశారు. అనంతరం దర్యాప్తును వేగవంతం చేసి, హాస్య నటుడు భారతి కన్నన్‌ను, అతనికి సహకరించిన మహేంద్రన్, రమేష్ అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. మైనర్ బాలికతో ఈ దారుణానికి పాల్పడిన నిందితులందరిపై పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ప్రముఖులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన వారందరినీ న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
ఒక హాస్య నటుడు ఇలాంటి దారుణమైన నేరంలో పాలుపంచుకోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. మైనర్ బాలికతో వ్యభిచారం చేయించి సొమ్ము చేసుకున్న ఈ సంఘటన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





