SGSTV NEWS online
Crime

పులివెందులలో పోలీసులపై దాడులు – 562 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు



Police Cases on Pulivendula Incident : పులివెందులలో శనివారం చోటుచేసుకున్న ఘర్షణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు 562 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. పోలీసులపై దాడుల ఘటనను అధికారులు తీవ్రంగా పరిగణించారు. మరోవైపు పులివెందులలో పోలీసుల నిఘా, భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి.

అసలేం జరిగిదంటే : శనివారం ఎంపీ అవినాశ్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన అరాచకంతో పులివెందుల రణరంగంగా మారింది. నామపత్రాల దాఖలు సందర్భంగా టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు కార్యాలయానికి వచ్చారు. తెలుగుదేశం అభ్యర్థి నామపత్రాల ప్రక్రియ కొనసాగుతుండగానే ఎంపీ అవినాశ్రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు. తామూ లోపలికి వెళ్లి, తమ అభ్యర్థితో నామినేషన్‌ వేస్తామని అవినాశ్రెడ్డి పట్టుబట్టారు.

AP Local Body Elections 2026 : టీడీపీ అభ్యర్థి ప్రక్రియ పూర్తిచేసి బయటకొచ్చాక పంపిస్తామని పోలీసులు చెప్పినా వినకుండా లోపలికి వెళ్లితీరాల్సిందేనంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. కర్రలతో దాడిగి దిగారు. ఆ పార్టీ కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. లాఠీఛార్జ్‌ చేశారు. అయినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెనక్కి తగ్గకుండా అరాచకాన్ని కొనసాగించారు. అవినాశ్రెడ్డి వారిని వెనకుండి నడిపించారు. నామినేషన్‌ వేసే కార్యాలయం కొద్ది దూరంలోనే కార్యకర్తలతో బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులపైకి మరోసారి రాళ్లు విసిరి, కర్రలతో దాడికి దిగారు

కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నించారు. ఎస్పీపైనా వైఎస్సార్సీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏంచేయాలో అర్థంకానీ పోలీసులు మరోసారి 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ వెంటనే భాష్పవాయువు గోళాలు, టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు కాస్త వెనక్కి తగ్గారు. ఆ తర్వాతా ఆందోళనను కొనసాగించిన వైఎస్సార్సీపీ శ్రేణులు 3 గంటలకి నామినేషన్లు వేసే సమయం ముగిసిపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎంపీ అవినాశ్రెడ్డితో పాటు మనోహర్‌రెడ్డి, దుష్యంత్‌రెడ్డి ఈ అరాచకం వెనక ఉన్నారని, ముందస్తు ప్రణాళికతోనే తతంగానికి తెరదీశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 562 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also read

Related posts