November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Latest News

సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేస్తాం – ఎన్నికలు బహిష్కరించిన ప్రజలు – People Boycotted Voting

రాష్ట్రంలో హోరాహోరీగా పోలింగ్ జరుగుతున్న వేళ కొన్ని గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి. తమ హామీలను నెరవేర్చే వరకు ఓటు వేయమని స్పష్టం చేస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గం కమ్మవారిపాళెం గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కమ్మవారిపాళెంకు రోడ్డు సౌకర్యం కల్పించమని ప్రతి రాజకీయ నాయకుడిని విజ్ఞప్తి చేశామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయాల చూట్టూ తిరిగి అధికారులకు ఫిర్యాదులు చేశామని వెల్లడించారు. ఎన్నోసార్లు స్పందన కార్యక్రమంలో సైతం అర్జీలు అందించామని గుర్తు చేశారు. కానీ ఎవ్వరూ తమ సమస్యను పరిష్కరించలేదని వాపోయారు. 2019 ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చిన అన్ని రాజకీయ నాయకులను రోడ్డు వేయమని విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు.

ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు : అప్పుడు సూళ్లురుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కిలివేటి సంజీవయ్య అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఐదేళ్లు గడిచిన రోడ్డు వేయలేదని గ్రామస్థులు మండిపడ్డారు. ఈ సారి ఓట్ల కోసం వచ్చినప్పుడు నిలదీస్తే మరోసారి గెలిచినప్పుడు వేస్తామని చెబుతున్నారు. ఇలా ప్రతి ఒక్క నాయకుడు వారి స్వార్థం కోసం మాత్రమే హామీ ఇస్తున్నారు కానీ మా సమస్యలు మాత్రం తీర్చటం లేదని వాపోయారు. అందుకోసమే ఈ సారి ఎన్నికలను గ్రామస్థులందురూ బహిష్కరిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ లిఖితపూర్వకంగా రోడ్డు వేస్తామని హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. లేదంటే ఎన్నికల్లో ఓటు వేయమని కమ్మవారిపాళెం గ్రామస్థులు తెల్చిచేప్పారు. అయితే ఈ గ్రామంలో 250 మంది ఓటర్లు ఉన్నారు
సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఓట్ల వేస్తాం : సత్యవేడు నియోజకవర్గంలో ఓ గ్రామ ప్రజలు పోలింగ్‍ బహిష్కరించారు. కేవీబీ పురం మండలం కేసీ కండ్రిగ గ్రామ ప్రజలు ఓటు వేసేందుకు వెళ్ళకుండా ఊరి బయట బైఠాయించి నిరసనకు దిగారు. తమ గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తమ గ్రామ పరిధిలో ఇసుక, మట్టి తరలించిన నాయకులు తమ గ్రామాన్ని అభివృద్ది చేయలేదని ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తే తప్ప ఓటు వేసేందుకు వెళ్లమని గ్రామంలోనే బెఠాయించారు.పోలింగ్ బూత్ వద్ద నిరసనలు :అలాగే తమ గ్రామాలను గిరిజనుల గ్రామాలుగా గుర్తించి ఐటీడీఏలో కలపాలని ఏలూరు జిల్లా వంగబొత్తప్పగూడెం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఈ మేరకు గ్రామస్థులంతా పోలింగ్ బూత్ వద్ద వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా అధికారులకు వినతి పత్రం అందించారు. ఇప్పటికైనా తమను గుర్తించి ఆదుకోవాలని కోరారు. లేకుంటే ఓటు వేయమని స్పష్టం చేశారు.

Also read

Related posts

Share via