ఆన్ లైన్ ట్రేడింగ్ లో లాభాలు చూపించి మోసం
తొలుత పెట్టిన రూ.50 వేలకు మంచి లాభాలు
రూ.50 లక్షల పెట్టుబడికి రూ.67 లక్షల రిటర్న్స్
డ్రా చేసుకోవడానికి డబ్బులు చెల్లించాలంటూ మెలిక
ఆన్ లైన్ మోసగాళ్లు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. సామాన్యుల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్లనూ బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఓ విశ్రాంత ఉద్యోగిని ఇలాగే మోసం చేసి ఏకంగా రూ.1.87 కోట్లు కాజేశారు. ఆన్ లైన్ ట్రేడింగ్ లో భారీ లాభాలు వస్తాయని ఆశపెట్టి ఆయన దగ్గర ఉన్న సొమ్మంతా కాజేశారు. తొలుత చిన్న మొత్తం పెట్టుబడి పెట్టగా భారీ మొత్తంలో లాభాలు వచ్చేలా చేసి ఆశపెట్టారు. ఆపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించి, భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపించారు. అయితే, వాటిని డ్రా చేసుకునే వీలు లేకుండా చేసి మోసం చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
మణిపూర్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇటీవల ఆయనకు ఫేస్ బుక్ మెసెంజర్ లో ఓ సందేశం వచ్చింది. ఆన్ లైన్ లో ట్రేడింగ్ చేస్తూ ఇంట్లో కూర్చుని పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని ఆశపెట్టారు. దీంతో సదరు మాజీ ఆఫీసర్ కొంత ఆశ, మరికొంత అపనమ్మకంతోనే ట్రేడింగ్ మొదలుపెట్టారు. తొలుత రూ.50 వేలు పెట్టుబడి పెట్టగా భారీగా లాభాలు వచ్చాయి. ఆయన వెంటనే వాటిని డ్రా చేసుకున్నారు. ఇప్పటి వరకూ అంతా సాఫీగా జరగడం, నిజంగానే లాభాలు రావడంతో మాజీ అధికారికి నమ్మకం కుదిరింది. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం ప్రారంభించారు. వాటికి కూడా లాభాలు రావడంతో ఈసారి ఏకంగా రూ.50 లక్షలు పెట్టారు. తన పెట్టుబడికి అసలుతో కలిపి రూ.67 లక్షలు వచ్చాయి.
అన్ లైన్ లోని తన ఖాతాలో ఈ లాభాలు చూపించినా డబ్బులు డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా నిర్వాహకులు అడ్డుకున్నారు. నిర్ణీత మొత్తం చార్జీ చెల్లిస్తేనే డ్రా చేసుకునే వీలుంటుందని మెలిక పెట్టారు. ఇది కూడా న్యాయమే అని వాళ్లు అడిగిన చార్జీలను మాజీ అధికారి చెల్లించారు. అయినా డబ్బు రాకపోవడంతో నిర్వాహకులను సంప్రదించగా మరికొంత మొత్తం చెల్లించాలని కోరారు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.1.87 కోట్లు కట్టించుకున్నారు. కొంత మొత్తం చెల్లించాక మరింత చెల్లిస్తే కానీ మీ డబ్బులు రావని చెప్పడంతో విధిలేక పదే పదే చెల్లింపులు జరిపినట్లు బాధితుడు తెలిపారు. ఇక తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో నిర్వాహకులు ముఖం చాటేశారని, ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని పోలీసులను ఆశ్రయించాడు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..