SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహాల పురాణం – 2 వ అధ్యాయం – పురాణ
ప్రారంభం – 2

పురాణ ప్రారంభం – 2*

“నవగ్రహ వీక్షణం సూక్ష్మపరిధిలోనూ, స్థూల పరిమాణంలోనూ మానవుణ్ని నియంత్రిస్తూ, అతని జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది. ఆహారం, ఆరోగ్యం, సంతానం, సంపద, విద్య, విజ్ఞానం, వైభవం ఇవన్నీ కూడా గ్రహవీక్షణను అనుసరించి మనిషికి లభిస్తాయి. మానవుడి జాతక చక్రంలో కొలువుదీరి, అతని జీవిత చక్రాన్ని తిప్పే అశేష శేష శక్తి స్వరూపాలే నవగ్రహాలు. అంతరిక్షంలో తేజోమండలాలలో సంచరిస్తూ వుండే నవగ్రహ దేవతా మూర్తులే ఆలయాలలో అర్చామూర్తులుగా మనకు దర్శనమిస్తున్నారు. “.

“మానవుడి త్రికరణాలనూ – అంటే మనసునూ, మాటనూ, చేతనూ నియంత్రించే అతీత శక్తులే ఆ నవగ్రహాలు. విడమరచి చెప్పాలంటే, మన ఆలోచనలకూ, – అభివ్యక్తీకరణకూ, ఆచరణకూ మూలం ఆ గ్రహాల ప్రభావమే అని అర్థం…..”

అంటే… గురువుగారూ… ఆ గ్రహాలు తిన్నగా చూడకపోతే… “విమలానందుడు ఏదో అడగబోయాడు.

*”అదే చెప్పబోతున్నాను నాయనా ! గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ దృష్టిని సారిస్తే, మనిషి జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. ఆ గ్రహాలు ఆగ్రహిస్తే మనిషి జీవితం కన్నీటి కడలిలో కష్టాలయాత్రే అవుతుంది”*

*”గురువుగారూ ! నవగ్రహాల ప్రభావం సామాన్య మానవుల మీద మాత్రమే వుంటుందా ?”* శివానంద అడిగాడు.

*”మానవులే కాదు, దానవులు, దేవతలు – ఒక్కమాటలో చెప్పాలంటే – సృష్టిలోని సకల ప్రాణుల మీదా గ్రహాల ప్రభావం వుంటుంది.”*

*”అంటే… మహామహులైన పురాణ పురుషుల మీద కూడా నవగ్రహాల ప్రభావం వుంటుందా, గురువుగారూ?”* శివానందుడు అడిగాడు.

*”ఒక్కపురాణ పురుషులే ఏమిటి, నాయనా… అవతార పురుషులు కూడా గ్రహాల ప్రభావాలకు లోనైన వారే”* నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు.

*”అవతార పురుషులు కూడానా ? నమ్మశక్యంగా లేదు !”* సదానందుడు ఆశ్చర్యంతో అన్నాడు

నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *”ఆశ్చర్యమేముందీ? శ్రీరామచంద్రమూర్తికి వనవాస క్లేశమూ, భార్యా వియోగమూ ఎందుకు కలిగాయి ? ధర్మరాజు అడవుల పాలెందుకయ్యాడు ? హరిశ్చంద్రుడు కట్టుకున్న యిల్లాలిని ఎందుకు అమ్ముకున్నాడు ? ఎందుకు కాటికాపరి అయ్యాడు ? ఆయన తండ్రి త్రిశంకుడు భువికి దీవికీ మధ్య ఎందుకు వేళ్ళాడుతూ వుండి పోయాడు?”.

*”సాక్షాత్తూ, శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు గ్రహవీక్షణకు లోనయ్యాడంటే…” చిదానందుడు నమ్మలేనట్టుగా అన్నాడు.

*”నమ్మశక్యంగా లేదా ?”* నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు.

*”ఆ శ్రీరామచంద్రుడు లంకాయుద్ధసమయంలో అగస్త్యమహర్షి నుండి ఉపదేశం పొంది ‘ఆదిత్య హృదయం’ ఎందుకు జపం చేశాడంటావు ? గ్రహరాజు శక్తికి ఆయన లోబడినట్టే కదా అర్థం? ఆ శని ప్రభావంతో సర్వాన్నీ వొడ్డి వోడిన ధర్మరాజు, అరణ్యంలో సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్ర ఎందుకు పొందాడంటావు ? సందేహానికి తావులేదు నాయనా ! మానవులూ, దానవులూ, దేవతలూ అందరూ నవగ్రహాల ప్రభావాన్నీ, ప్రాభవాన్నీ రుచి చూసిన వాళ్ళే!”*

*”మీరు చెప్పింది తార్కికంగా వుంది. గురువుగారూ !”* విమలానందుడు అన్నాడు.

*”ఔను ! నవగ్రహాల చరిత్రల్లో ఎన్నో అద్భుతాలున్నాయి. అవన్నీ కూడా కథాక్రమంలో మీరు తెలుసుకుంటారు ! ఇంక – నవగ్రహ పురాణశ్రవణం ప్రారంభించుదాం !”* అంటూ నిర్వికల్పానంద కళ్ళు మూసుకుని, చేతులు జోడించాడు.

*”శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యోనమః !”*

*”ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ*

*గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః !!*

స్తోత్రం ముగించి, కళ్ళు తెరిచి, నిర్వికల్పానంద శిష్యుల వైపు చూశాడు.

*”నవగ్రహాల సృష్టికి అంకురార్పణ సృష్టి ప్రారంభంలో జరిగింది. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో వున్నాం. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. కలియుగానికి ముందు ద్వాపర యుగం, దానికి ముందు త్రేతాయుగం : త్రేతాయుగానికి ముందు కృతయుగం – గతించాయి. కృతయుగంలో సృష్టి ప్రారంభమైంది. దానికి ఒకనేపథ్యం వుంది. ఆ నేపథ్యమే మహాప్రళయం ! సృష్టి క్రమం అర్థం చేసుకోవడానికి, ప్రళయానికి చెందిన అవగాహన అవసరం… వినిపిస్తాను… వినండి !”* అంటూ ప్రారంభించాడు నిర్వికల్పానంద.

జై గురు దత్త

సేకరణ… ఆధురి భాను ప్రకాష్

Related posts

Share this