March 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

దళితుని హత్య -మృతదేహం డోర్‌డెలివరి

చిత్తూరు  :గ్రానైట్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న దళితుడిని యజమానే హత్య చేసి, మృత దేహాన్ని డోర్‌డెలవరి చేసిన ఉదంతం ఇది! చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం పాచిగుంటలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుని బంధువులు, స్నేహితులు ఆందోళన చేయడంతో కేసు నమోదు చేశారు. గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమానిని , మృతదేహాన్ని డోర్‌డెలివరి చేయడానికి సహకరించిన ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు పాచిగుంట దళితవాడకు చెందిన సుధాకర్‌ (51) చిత్తూరు పారిశ్రామికవాడలోని ఓ గ్రానైట్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గ్రానైట్‌ కంపెనీ యజమాని నాగరాజు శుక్రవారం సుధాకర్‌ ఇంటికి వచ్చాడు. మాట్లాడే పని ఉందంటూ ఉదయం 8.30 గంటల సమయంలో ఆయనను బయటకు తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఒక ఆటోలో సుధాకర్‌ మృతదేహాన్ని తీసుకొచ్చి ఇంటి వద్ద పడేసి పరారయ్యాడు. ఈ సంఘటనతో ఆయన కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతికి గురయ్యారు.. మృతదేహాన్ని శనివారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి అక్కడి పోలీస్‌ అవుట్‌ పోస్టులో ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రానైట్‌ కంపెనీ యాజమానే హత్య చేశాడంటూ ఆస్పత్రి ఎదుట, వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట సుధాకర్‌ బంధువులు, స్నేహితులు ఆందోళనకు దిగారు. ఆయనపైనా, ఆటో డ్రైవర్‌ రఘుపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు పోలీసులు అంగీకరించడంతో ఆందోళన విరమించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు నాగరాజుపైనా, ఆటో డ్రైవర్‌ రఘుపైనా కేసు నమోదు చేశామని, వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చిత్తూరు వన్‌టౌన్‌ సిఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.

Also read

Related posts

Share via