July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

MROపై పెట్రోల్ పోసిన మహిళా రైతులు.. అంతటితో ఆగకుండా..!

ఎమ్మార్వో మీద మహిళా రైతులు పెట్రోల్ పోసిన ఘటన సంచలనంగా మారింది. ఆ మహిళలు అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

రైతులు ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూమిని కన్నబిడ్డలా చూసుకుంటూ ఆరుగాలం కష్టపడి సాగు చేస్తుంటారు. పంట వల్ల లాభాలు రాకపోయినా ఫర్లేదు.. నష్టాలు తప్పితే చాలని అనుకుంటారు. అకాల వర్షాలు, వడగళ్లు, గాలుల వల్ల పంట నష్టం సంభవించినా ఎవర్నీ ఏమీ అనరు. ఏదైనా ఉంటే సాగు చేసుకునే భూతల్లికే తమ గోడు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి భూమి విషయంలో సమస్య వస్తే మాత్రం ఎక్కడిదాకా అయినా వెళ్తారు. భూమి పంచాయితీలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వీటి వల్ల తీవ్ర ఘర్షణలు చెలరేగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ ఘటనే జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

భూమి సమస్య తీర్చడం లేదంటూ ఏకంగా ఎమ్మార్వో మీద పెట్రోల్ పోశారు మహిళా రైతులు. జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ ఎమ్మార్వో ఆఫీసులో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ భూమి సమస్యను తీర్చడం లేదంటూ నలుగురు మహిళా రైతులు బాటిల్లో పెట్రోల్ తీసుకొని ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చారు. అక్కడి తహశీల్దార్ మీద పెట్రోల్ పోశారు. అక్కడితో ఆగకుండా తాము ఆత్మహత్యకు పాల్పడ్డారు బాధితులు. దీంతో ఎమ్మార్వో ఆఫీసు అట్టుడికింది. బాధితులను అక్కడ ఉన్న వాళ్లు ఆపారు. ఈ ఘటన మీద పోలీసులకు తహశీల్దార్ జ్యోతి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సాధారణంగా భూమి సమస్యలు తీర్చడం లేదని అధికారులతో గొడవ పడటం చాలా చోట్ల జరగడం వార్తల్లో చూసే ఉంటాం. కానీ ఇలా అధికారిపై పెట్రోల్ పోయడం మాత్రం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఎమ్మార్వో మీద మహిళా రైతులు పెట్రోల్ పోసిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ సమస్యను పరిష్కరించడం కోసం అధికారులను నిలదీయడం వరకు ఓకే.. కానీ ఇలా చేయడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.

Also read

Related posts

Share via