April 16, 2025
SGSTV NEWS
LifestyleSpiritual

హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!



హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా చేసే నైవేద్య వంటకం.. వడలు. ఈ రోజు హనుమంతుడికి ఇష్టమైన వంటకాలలో ఇది ప్రధానమైనది. కొన్ని ప్రాంతాల్లో వడలతో హారాలను కూడా సమర్పించే ఆనవాయితీ ఉంది. మీరు కూడా భక్తిశ్రద్ధలతో స్వయంగా వడలు చేసి హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి.

జై శ్రీరాం ! మనందరి ఆరాధ్యుడు, భక్తహనుమంతుడు జన్మించిన పవిత్రమైన రోజైన హనుమాన్ జయంతి సందర్భంగా.. ఆయన్ని స్మరించుకుంటూ, ఆయనకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడం ఆనవాయితీ. ఆయన్ని సంతృప్తిపర్చే భక్తితో వడలు తయారు చేసి సమర్పిద్దాం. ముందుగా హనుమాన్ జయంతి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

హనుమాన్ జయంతి అంటే హనుమంతుడు జన్మించిన పర్వదినంగా భావించబడుతుంది. ఈ రోజును చైత్ర పౌర్ణమి నాడు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరామునికి విశ్వాస భక్తుడైన హనుమంతుడు ధైర్యం, శక్తి, భక్తి, వినయానికి ప్రతీకగా పరిగణించబడతాడు. ఆయన్ని కలియుగ దేవతగా భావిస్తూ భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి, విశేష పూజలు చేసి, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, భజనలు, ఆరాధనలు చేయడం ద్వారా ఆయన ఆశీస్సులు పొందాలని తపిస్తారు.

ఈ రోజున హనుమంతుడికి నైవేద్యంగా వడలు సమర్పించడం విశేషం. వడలతో కూడిన హారాన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో సమర్పించే సంప్రదాయం ఉంది. ఇప్పుడు మనం ఈ వడలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు
శనగపప్పు – 1 కప్పు
మినపప్పు – 1 కప్పు
జీలకర్ర – 1 టీస్పూన్
పచ్చిమిర్చి – రుచికి సరిపడా
కొత్తిమీర – తగినంత
అల్లం – 1 చిన్న ముక్క
ఉప్పు – రుచికి సరిపడా
చక్కెర – 1 టీస్పూన్ (ఆప్షనల్ మాత్రమే)
ఇంగువ – ½ టీస్పూన్
ఆయిల్ – ఫ్రై కి సరిపడా

తయారీ విధానం

ముందుగా శనగపప్పు, మినపప్పు ఒక్కొక్కటి వేరుగా రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఆ నీటిని పూర్తిగా వడగట్టి పప్పులను రెండు సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత కొత్తిమీరను సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. అల్లం ముక్కను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా మెత్తగా రుబ్బుకోవచ్చు. పచ్చిమిరపకాయలను మీకు కావాల్సిన స్టైల్ లో కట్ చేసుకోండి.

ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, చక్కెర, ఇంగువ వీటన్నింటినీ ఒక గ్రైండర్ జార్‌లో వేసి నీరు వేయకుండా చక్కగా మిక్సీలో రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా మధ్య రకంలో రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మిశ్రమంలో రెండు నుంచి మూడు స్పూన్ల వేడి నూనె వేసి బాగా కలపాలి. అప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకుని చేతితో వడాలా తిప్పి మధ్యలో వేలితో చిన్న రంధ్రం చేయాలి.

ఇప్పుడు స్టౌవ్ పై కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక వడలను నెమ్మదిగా వేసి మీడియమ్ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఈ వడలను బయటకు తీసి పేపర్ టవల్ మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ ఎక్కువగా ఏమైనా ఉంటే పోతుంది. ఇంతే సింపుల్.. ఇప్పుడు ఈ వడలను దేవుడికి నైవేద్యంగా అర్పించి ఆ తర్వాత మీ కుటుంబంతో కలిసి ఆరగించండి. ఇలా చేసిన వడలు మసాలా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. మీరు కావాలంటే చట్నీతో కాకుండా అలాగే తినేయచ్చు.

ఈ వంటకానికి చిన్న చిట్కాలు
పప్పులను నానబెట్టిన తర్వాత వాటిలో ఉన్న నీటిని పూర్తిగా వడగట్టి తీసేయాలి. పప్పుల మిశ్రమాన్ని గ్రైండ్ చేయేటప్పుడు ఒక్క బొట్టు నీరైనా వేయకూడదు. నీరు కలిపితే వడల రూపం కుదరకపోవచ్చు. అలాగే అవి నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. మిశ్రమాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని అరగంటపాటు ఫ్రిడ్జ్‌లో పెట్టితే మంచిది. ఇలా చేస్తే వడలలో నూనె తక్కువగా పడుతుంది. వడలు బాగా కరకరగా లోపల మెత్తగా వస్తాయి.

వడలు వేయించేటప్పుడు మద్యస్థ మంటపైనే వేయించాలి. మంట ఎక్కువగా ఉంటే వడలు బయట నుంచి కాలిపోతాయి లోపల పదార్థం పచ్చిగా ఉండిపోతుంది. మంట చాలా తక్కువగా ఉంటే వడలు నూనెను ఎక్కువగా పీల్చుకుని నారంలా అవుతాయి. అందుకే మితమైన మంటపైనే బంగారు రంగు వచ్చే వరకు వడలను వేయించాలి. అప్పుడు వాటి రుచి, ఆకారం రెండూ బాగుంటాయి

Related posts

Share via