ఎంత కష్టమొచ్చినా.. కన్నీళ్లొచ్చినా.. బిడ్డల్ని కళ్లల్లో పెట్టుకొని కాపాడేది తల్లి. అలాంటి తల్లే కన్న బిడ్డలకి తీరని అన్యాయం చేస్తే.. ఇక ఆ బిడ్డలకు దిక్కెవ్వరు? సరిగ్గా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో వెలుగుచూసింది. కేవలం పిల్లలను వదిలేయడమే కాదు, తన తండ్రి డబ్బును, స్కూటర్ను కూడా దొంగిలించి ప్రియుడితో చెక్కేసిన షాకింగ్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగింది?
పంఢరపూర్ – శంభాజీనగర్ రూట్లో వెళ్తున్న ఒక బస్సులో ఈ ఘటన జరిగింది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను బస్సు ఎక్కించి, తన తండ్రి స్కూటర్ వేసుకుని ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది. బస్సులో ఆ పిల్లలు ఇద్దరూ ఒంటరిగా ఏడవడం గమనించిన కండక్టర్, వారి దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. ఆ సమయం లోనే ఒకరి జేబులో ఉన్న చీటీని చూసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
బస్సులో ఏడుస్తున్న ఒక చిన్నారి జేబులో ఉన్న చీటీలో ఏముంది అంటే “ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు, దయచేసి వీరిని యావత్మాల్ వెళ్లే బస్సు ఎక్కించండి.” అని ఉన్న హృదయవిదారకమైన వాక్యాలివి. ఆ నోట్ పక్కనే ఒక మొబైల్ నంబర్ కూడా ఉంది. పోలీసులు ఆ నంబర్కు ఫోన్ చేసి విచారించగా నమ్మలేని ఒక షాకింగ్ నిజం బయట పడింది.
సరిగ్గా అదే సమయంలో, యావత్మాల్కు చెందిన ఒక వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు ఇంట్లో ఉన్న డబ్బు, స్కూటర్ తీసుకుని పారిపోయిందని ఆ ఫిర్యాదు సారాంశం. కేసు నమోదు చేసుకున్న బీడ్ (Beed) జిల్లా పోలీసులు ఆ వృద్ధుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. బస్సులో ఒంటరిగా దొరికిన ఆ ఇద్దరు పిల్లలు మరెవరో కాదు, తన స్వంత మనవడు, మనవరాలేనని అతను గుర్తించాడు. ఆ పిల్లల కన్నతల్లే వారిని నడిరోడ్డుపై వదిలేసి, తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలిపాడు.
మరో షాకింగ్ సంగతి ఏంటంటే. బిక్కు బిక్కుమంటున్న పిల్లల్ని చూశాక తాత ప్రవర్తన పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒంటరిగా ఉన్న పిల్లల్ని చూసి తాత మనసు కరగలేదు, కనీసం ఓదార్చ లేదు. వారిని ఇంటికి తీసుకెళ్లడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు సరికదా పిల్లల భవిష్యత్తు కంటే, పోయిన తన స్కూటర్ గురించే అతడు ఎక్కువ ఆందోళన చెందడం మరింత విస్మయ పర్చింది. ఆ పిల్లల బాధ్యతను తీసుకోవడం తన వల్లకాదని తెగేసి చెప్పాడు. చివరకు, పోలీసులే ఆ పిల్లల రక్షణకు ఏర్పాట్లు చేశారు. బీడ్ జిల్లా శిశు సంక్షేమ కమిటీ (Child Welfare Committee), జిల్లా పరిపాలనా యంత్రాంగం సహాయంతో ఆ ఇద్దరు పిల్లలను సురక్షితమైన చిల్డ్రన్ హోమ్ కు తరలించారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- Mysterious Temple: ఈ ఆలయంలో దెయ్యాలకు శిక్ష పడుతుందట..! ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కృష్ణాజిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య




