February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrimeSpiritual

భక్తులు భారీగా వస్తారని తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేదు..Chandrababu


తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ..అందుకు తగ్గ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

Cnadrababu Naidu: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు..సుమారు 50  మంది భక్తులు తీవ్ర గాయాలతో తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు.


వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం..తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్‌ సర్వదర్వనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10,11,12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20  లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు అధికారులు ముందుగానే ప్రకటించారు.


గురువారం (9 వ తేదీ) ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో బుధవారం ఉదయం నుంచే  రాష్ట్రంతో పాటు పొరుగునున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. మొత్తం నాలుగు ప్రాంతాల్లో జీవకోన,బైరాగిపట్టెడ, శ్రీనివాసం,అలిపిరి వద్ద తొక్కిసలాట జరిగింది.

ఈ క్రమంలో ఈ తొక్కిసలాటలో భక్తులు చనిపోయిన విషయం తెలిసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ..అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధ్యత లేదా..?
విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన పై డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి కలెక్టర్‌, ఎస్పీలతో బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.


ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమైన అధికారుల పై తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వాహణ, భద్రతను పునస్సమీక్షించాలని ఆదేశించారు. విశాఖపట్నంలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో ఇలాంటి బాధాకర విషయం జరగడం తీవ్ర ఆవేదనకి గురి చేసిందని  ముఖ్యమంత్రి అన్నారు.
క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు గురువారం చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నారు.ఘటన సమాచారం తెలిసినప్పటి నుంచి ఆయన తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్‌ లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనాస్థలికి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు.

Also Read

Related posts

Share via