SGSTV NEWS online
Andhra PradeshCrime

సీబీఐ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. ఐదుగురి అరెస్ట్



మదనపల్లె : సీబీఐ అధికారుల పేరుతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మదనపల్లె ఒకటో పట్టణ సీఐ మోహన్ కుమార్ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని అగడ్త వీధికి చెందిన సాధిక్ ను ఈనెల 11న కర్ణాటకకు చెందిన కొందరు కిడ్నాప్ చేశారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో ఓ కేసులో నిందితుడిగా ఉన్న సాధిక్… తరచుగా అక్కడి కోర్టు విచారణకు హాజరయ్యేవారు. ఈ క్రమంలోనే చిత్తూరుకు చెందిన రాజ శ్రీనివాసులు ఆలియాస్ ఆర్ శ్రీనివాసన్తో సాధికక్కు పరిచయం ఏర్పడింది. సాధిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా డబ్బు సంపాదించారని గుర్తించిన శ్రీనివాసన్.. ఎలాగైనా అతన్ని కిడ్నాప్ చేసి డబ్బు వసూలు చేయాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన వెంకటరమణకు సమాచారం ఇచ్చాడు. వెంకటరమణ కర్ణాటకకు చెందిన కొంతమందితో సాధికన్ను కిడ్నాప్ చేసేందుకు ప్రణాళిక రూపొందించాడు.

ఈనెల 11న మదనపల్లెకు చేరుకున్న కిడ్నాపర్లు స్థానిక శ్మశాన వాటిక వద్దకు వెళ్తున్న సాధికన్ను కిడ్నాప్ చేసి కర్ణాటకకు తీసుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆదాయానికి మించి డబ్బు వసూలు చేసినట్లు తేలిందని, కేసు నుంచి తప్పించాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం సాధిక్ కుటుంబ సభ్యులకు తెలియడంతో ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు.



కిడ్నాపర్లను పట్టుకునేందుకు ఎస్సై రహీముల్లా, మదనపల్లె రూరల్ ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు.. బాధితుడి బందువులు, స్నేహితుల వద్ద నుంచి రూ.26 లక్షలను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. మిగిలిన డబ్బు తీసుకునేందుకు శనివారం రాత్రి కర్ణాటక నుంచి కారులో వస్తుండగా మదనపల్లె వద్ద పోలీసులు వారిని

పట్టుకున్నారు. కిడ్నాపర్ల నుంచి సాధికన్ను విడిపించి మదనపల్లెకు తీసుకొచ్చారు. నిందితుల వద్ద ఉన్న కారు, నకిలీ తుపాకీ, సీబీఐ పేరిట ఉన్న నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ అరెస్టు వారెంట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వెంకటరమణ పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు

Also read

Related posts