SGSTV NEWS online
CrimeTelangana

Khammam CI : కామంతో కళ్లు మూసుకుపోయిన ఖాకీ..న్యాయం కోసం వస్తే.. గర్భవతిని చేసి..!


రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారి, న్యాయం కోసం వచ్చిన అభాగ్యురాలి జీవితాన్ని నాశనం చేసిన ఉదంతం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా బలవంతంగా గర్భస్రావం చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Khammam CI :  రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారి, న్యాయం కోసం వచ్చిన అభాగ్యురాలి జీవితాన్ని నరకప్రాయం చేసిన భయంకర ఉదంతం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. భర్త వేధింపుల నుండి కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహిత అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా బలవంతంగా గర్భస్రావం చేయించిన ఘటన తెలంగాణవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితుడైన సీఐ బానోత్ రాజు నాయక్‌పై క్రిమినల్ కేసు నమోదు కాగా, ఉన్నతాధికారులు ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ దారుణానికి సంబంధించిన కథ 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో మొదలైంది. అప్పట్లో అక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్న బానోత్ రాజు నాయక్ వద్దకు ఒక వివాహిత తన భర్త పెడుతున్న వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వచ్చింది. బాధితురాలికి అండగా నిలవాల్సిన సీఐ రాజు, ఆమె ఇచ్చిన కంప్లైంట్ కాపీలోని వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను తీసుకుని తప్పుడు ఉద్దేశంతో ఆమెకు దగ్గరవ్వడం ప్రారంభించాడు.నీకు నేనున్నాను, చట్టపరంగా పూర్తి న్యాయం చేస్తానంటూ నిరంతరం ఫోన్లు, మెసేజ్‌లతో మాయమాటలు చెప్పాడు. కాలక్రమేణా ఆమె మానసిక స్థితిని ఆసరాగా చేసుకుని, తాను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను పూర్తిగా తన వలలో వేసుకుని లొంగదీసుకున్నాడు.

బాధితురాలిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్న సీఐ రాజు, ఆమె భర్తపై తన పోలీస్ అధికార బలంతో తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చాడు. బెదిరింపులకు గురిచేసి ఇటీవలే కోర్టు ద్వారా సదరు మహిళకు భర్త నుండి అధికారికంగా విడాకులు ఇప్పించాడు. భర్త దూరం కావడంతో ఆ సీఐనే సర్వస్వంగా నమ్మిన బాధితురాలు ఈ క్రమంలోనే గర్భవతి అయింది. తాను ప్రెగ్నెంట్ కావడంతో ఇకనైనా తనను చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలని ఆమె సీఐ రాజుపై ఒత్తిడి తెచ్చింది. అయితే, అప్పటివరకు పెళ్లి పేరుతో నాటకమాడిన సీఐ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా, బాధితురాలికి ఆమెకు తెలియకుండా బలవంతంగా అబార్షన్ మాత్రలు మింగించాడు. దీనివల్ల ఆమెకు తీవ్ర రక్తస్రావమై గర్భస్రావం జరిగింది. ఆ తర్వాత కూడా ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అంతమొందిస్తానంటూ బెదిరింపులకు దిగాడు.

సీఐ రాజు నాయక్ చేతిలో తాను పూర్తిగా మోసపోయానని, తన జీవితం అటు భర్తకు, ఇటు సమాజానికి కాకుండా పోయిందని గ్రహించిన బాధితురాలు చివరకు ధైర్యం చేసి ఈనెల 7వ తేదీన ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన లీగల్ అఫీషియల్స్.. సీఐ రాజు నాయక్ సదరు మహిళను లైంగికంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక ఆధారాలతో నిర్ధారించారు.

దీంతో నిందితుడు రాజు నాయక్‌పై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో ఈ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించడంతో పోలీస్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఖమ్మం సీసీఎస్ (CCS) లో విధులు నిర్వహిస్తున్న సీఐ బానోత్ రాజు నాయక్‌ను తక్షణమే అక్కడి నుండి బదిలీ చేస్తూ, హైదరాబాద్‌లోని డీజీపీ (DGP) కార్యాలయానికి అటాచ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలికి పూర్తి స్థాయిలో చట్టపరమైన న్యాయం చేకూరుస్తామని ఉన్నతాధికారులు భరోసా ఇచ్చారు.

Also read

Related posts