SGSTV NEWS online
CrimeNational

Karnataka: కాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ…కాటికి పంపాడు



పెద్దమ్మ, పెదనాన్నలకు విషం ఇంజక్షన్లు ఇచ్చి హత్య మృతదేహాలపై నగలు.. బీరువాలోని సొత్తు దోపిడీ అప్పులు తీర్చుకునేందుకు కర్ణాటకలో ఓ వైద్యుడి ఘాతుకం

శివమొగ్గ : అప్పులు తీర్చుకునేందుకు ఆ వైద్యుడు వికృతరూపు దాల్చాడు. తన పెద్దమ్మ, పెదనాన్నలను కడతేర్చాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. భద్రావతి పట్టణం భూతనగుడి ప్రాంతానికి చెందిన చంద్రప్ప(80), జయమ్మ(70) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులు. ఉద్యోగాల రీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ఇంట్లో దంపతులు మాత్రమే ఉంటున్నారు. పడకగదిలో చంద్రప్ప, హాల్లోని మంచంపై జయమ్మ మంగళవారం చనిపోయి కనిపించారు. వారి ఒంటిపై నగలు, బీరువాలోని ఆభరణాలు, సొత్తు కనిపించలేదు. ఇంట్లో దొంగలు వెతుకులాడినట్లు, వారితో వృద్ధులు పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. పరిచయం ఉన్న వారే దారుణానికి ఒడిగట్టి ఉంటారని దంపతుల కుమారులు అనుమానించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి.

పరామర్శించేందుకని వెళ్లి…

వృద్ధులైన చంద్రప్ప, జయమ్మ.. కాళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. జయమ్మ సోదరి కుమారుడు మల్లేశ్ వైద్యుడు. భద్రావతిలోనే ఉంటున్నాడు. పెద్దమ్మ, పెదనాన్నలను పరామర్శించేందుకంటూ సోమవారం రాత్రి వారి ఇంటికి వెళ్లాడు. మీకు ఇంజక్షన్లు చేస్తాను… నొప్పులు ఇట్టే మటుమాయం అవుతాయని నమ్మించాడు. పడకగదిలో ఉన్న చంద్రప్పకు, హాల్లో టీవీ చూస్తున్న జయమ్మకు విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చాడు. కాసేపటికి వారు విగతజీవులయ్యారు. అనంతరం నగలు, సొత్తు తీసుకుని మల్లేశ్ వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు, బంధువులతో పాటు అక్కడకు వచ్చి మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా రోదించి వెళ్లాడు. వృద్ధులు విషపూరిత ఇంజక్షన్ల వల్లే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. వారికి పరిచయం ఉన్న వైద్యుడే ఇంటికి వచ్చాడన్న అనుమానంతో మల్లేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

పెద్దమొత్తంలో చేసిన అప్పులను తీర్చేందుకు డబ్బు అవసరమై హత్యలకు ఒడిగట్టినట్లు నిందితుడు అంగీకరించాడు.

Also read

Related posts