SGSTV NEWS online
Andhra PradeshCrime

కనిగిరి: ఆటో తగిలిందని.. డ్రైవర్ను కట్టేసి కొట్టారు



కనిగిరి, పామూరు : రోడ్డుపై వెళ్తున్న వ్యక్తికి వెనుక నుంచి వచ్చిన ఆటో తగలడంతో.. అతని సన్నిహితులు ఆ ఆటో డ్రైవర్ ను స్తంభానికి కట్టేసి కొట్టారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పీసీ పల్లి మండలం గుంటుపల్లికి చెందిన చీమలదిన్నె మహర్షి శుక్రవారం ఆటోలో నిమ్మకాయలు వేసుకొని పామూరు మండలం బొట్లగూడూరు బయలుదేరారు. మార్గమధ్యలో ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో… నడిచి వెళుతున్న తిరుపతయ్యకు ఆటో తగిలింది. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహానికి గురైన తిరుపతయ్య తన స్నేహితులు, బంధువులైన కమ్మ ప్రసాద్, రేగలగడ్డ నాగేశ్వరరావు, దొడ్డేజి హరికృష్ణ, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, చల్లా శ్రీనివాసులు, కోటపాటి  వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరిని అక్కడికి పిలిపించాడు.

వారంతా మహర్షి జుట్టు పట్టుకొని బొట్లగూడూరులోని జాతీయ రహదారి పక్కకు తీసుకెళ్లి, అతని చొక్కా విప్పేసి ఓ ఇనుప రాడ్ కు కట్టేశారు. అనంతరం బీరు సీసాలు, కర్రలతో దాడిచేసి కొట్టారు. ఈ ఘటనను ఓ యువకుడు సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు శుక్రవారం రాత్రి సదరు యువకుడి ఇంటి వద్దకు వెళ్లి ఆయనపై కూడా దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పది మందిపై డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్ కేసు నమోదు చేశారు. వారిలో  ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
బొట్లగూడూరులో పికెట్ ఏర్పాటుచేశారు.

Also read

Related posts