నిందితులకు కఠినశిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నాం కస్టడీ పిటిషన్ వేస్తాం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం ప్రియాంక కేసుపై తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిశోర్
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారును నిర్లక్ష్యంగా నడిపి, ఓ వైద్య విద్యార్థినిపై వాహనం ఎక్కించి.. పరారైన ఘటనను ఉద్దేశపూర్వక హత్యాయత్నంగా పరిగణిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ వెల్లడించారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇక్కడి ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత సోమవారం రాత్రి 10 గంటలకు ఆసుపత్రి నుంచి ప్రమాద సమాచారం వచ్చిన వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లారు. గాయపడిన మరో వైద్య విద్యార్థి ఉమేష్ నుంచి స్టేట్మెంట్ తీసుకొని, కేసు నమోదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలతో నిందితులు వినియోగించిన కారు, వారి వివరాలను సేకరించాం. ఉదయం 7 గంటలకు వారిని అదుపులోకి తీసుకున్నాం. సీసీ ఫుటేజీల్లో సేకరించిన ఆధారాలను బట్టి ఈ ఘటనను తీవ్ర నేరంగా పరిగణించి, బలమైన ఆధారాలతో కేసు కట్టాం. 6న నిందితులను అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చగా 21 వరకు రిమాండ్ విధించార’ని వివరించారు.
చనిపోతారని తెలిసీ..
సెక్యూరిటీ సిబ్బంది సినిమా థియేటర్లోకి అనుమతించలేదన్న కోపం.. మద్యం తాగిన తమను పోలీసులు పట్టుకుంటారనే ఆందోళనతో నిందితులు కారును వేగంగా నడిపారని ఎస్పీ తెలిపారు. మాల్ బయట గేటు వేసి అడ్డుకునేందుకు సెక్యూరిటీ సిద్ధమవడంతో యువకులిద్దరూ మరింత ఆగ్రహానికి గురై ఎలాగైనా వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ముందున్న వైద్య విద్యార్థుల బైక్ను ఢీకొట్టి, అమానుషంగా ప్రవర్తించి తీవ్ర నేరానికి పాల్పడ్డారని ఎస్పీ చెప్పారు. ‘ఆ సమయంలో కారును దశ్వంత్ నడుపుతూ.. వైద్యవిద్యార్థులు ప్రియాంక, ఉమేష్లు ప్రయాణిస్తున్న బైక్ను మూడు దఫాలు ఢీకొని వెంకటేశ్వరనగర్ వైపు దూసుకెళ్లారు. ఢీకొడితే చనిపోతారని తెలిసీ కూడా ఆ పని చేశారు. లోతైన దర్యాప్తునకు కస్టడీ పిటిషన్ వేసి, నిందితులను విచారిస్తాం. ప్రమాదం జరిగిన రాత్రి దశ్వంత్ ఇంటికి వెళ్లలేదు. వేరే ప్రాంతంలో కారులోనే పడుకున్నాడు’ అని ఎస్పీ తెలిపారు. ఈప్రమాదంలో ప్రసాద్ ఆదిత్యమాల్ సెక్యూరిటీ సిబ్బంది పాత్రపైనా దృష్టి సారిస్తామని చెప్పారు. కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిళ్లేవీ లేవని స్పష్టంచేశారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




