జైపూర్, మే 6: దేశ వ్యాప్తంగా నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ఆదివారం (మే 5) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ పరీక్షలో రాజస్థానలో ఓ విద్యార్ధికి బదులు మరొక విద్యార్ధి పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడు నీట్ పరీక్ష రాయవల్సి ఉండగా అన్నయ్య హాజరయ్యాడు. అసలు అభ్యర్ధికి బదులు డూప్లికేట్ అభ్యర్థి పరీక్షకు హాజరైనట్లు పరీక్ష నిర్వహణ అధికారులు ఆరోపించారు. వెంటనే పోలీసులను పిలిపించగా.. సోదరులిద్దరినీ అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
నీట్ యూజీ పరీక్ష ఆదివారం (మే 5) జరిగింది. ఇందుకోసం బార్మర్‌లో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన అంత్రిదేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చోటుచేసుకుంది. పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థిపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా.. అతను నకిలీ అభ్యర్థిగా తేలింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అతడిని అదుపులోకి విచారించగా.. నిజం అంగీకరించాడు. తన పేరు భగీరథ్ రామ్ అని.. తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో డమ్మీ అభ్యర్థిగా పరీక్ష రాసేందుకు వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. కాగా భగీరథ్ రామ్ గతేడాదే నీట్ యూజీ పరీక్షను క్లియర్ చేశాడు. అనేక ప్రయత్నాల తర్వాత అతడు NEET పరీక్షలో విజయం సాధించాడు. ప్రస్తుతం జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో భగీరథ్ రామ్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
తమ్ముడి స్థానంలో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన భగీరథ రామ్ అనేక ప్రయత్నాల తర్వాత గతేడాది జరిగిన నీట్ యూజీ పరీక్షలో విజయం సాధించాడని, జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. తన తమ్ముడిని డాక్టర్‌ని చేసేందుకు, అతడి స్థానంలో నకిలీ అభ్యర్థిగా పరీక్ష రాయడానికి వచ్చి పట్టుబడినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు భగీరథ్‌తోపాటు, అతడి సోదరుడు గోపాల్ రామ్‌తోపాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!