SGSTV NEWS online
CrimeTelangana

చేయని నేరానికి ఒకరు.. చేసిన నేరం వెంటాడి మరొకరు



వికారాబాద్ జిల్లాలో రోజుల వ్యవధిలో చెల్లెలు, అన్న ఆత్మహత్య

ధారూరు: వికారాబాద్ జిల్లా స్టేషన్ ధారూరు గ్రామంలో ప్రేమ పేరుతో సాగిన వ్యవ హారం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. చేయని నేరానికి ఒకరిని, గతంలో చేసిన నేరం వెంటాడి మరొకరిని బలి తీ సుకుంది. డీఎస్పీ అంజయ్య, స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రమణీబాయి, రాములు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. కొడుకు రాజు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా, కూతురు తులసీబాయి వికారాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేసేది. అలాగే నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన పద్దుల మౌనిక రాజుతోపాటే ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేది.

ఈ క్రమంలో రాజు, మౌనిక కలిసి తులసికి కేటాయించిన పోలీస్ క్వార్టర్లో ఆమెతోపాటు ఉండేవారు. అయితే ప్రేమ పేరుతో మౌనికకు దగ్గరైన రాజు ఆమెను లోబర్చుకొని ఆపై మొహం చాటేశాడు. కొద్ది నెలల తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీనిపై రాజును నిలదీసిన మౌనిక.. ఆ తర్వాత తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. అనంతరం ఆమెకు సైతం పెళ్లి నిశ్చయమవగా జీర్ణించుకోలేని రాజు.. మౌనికతో తాను కలిసి దిగిన ఫొటోలను ఆమె కాబోయే భర్తకు పంపించి గొడవలు సృష్టించాడు. దీంతో ఏప్రిల్ 27న మౌనిక తన కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్ వచ్చి రాజు, తులసిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తులసిని పీఎస్కు పిలిపించగా మౌనిక కుటుంబ సభ్యులు ఆమెను దూషించి ఉద్యోగం ఊడగొట్టిస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన తులసి ఇటీవల ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంలో మౌనికపై కేసు నమోదైంది. అయితే ఆమె సైతం తాజాగా వివాహం చేసుకుంది. కానీ తనపై నమోదైన కేసు విషయంలో మౌనికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు పదేపదే బెదిరించడంతో తట్టుకోలేని రాజు గురువారం తన పొలానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తన చావుకు మౌనికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులే కారణమని సూసైడ్ నోట్ రాశాడు. చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని రోదిస్తూ చెప్పి పెట్టేశాడు. రాజు ఆత్మహత్య నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో తాండూరు-హైదరాబాద్ రోడ్డుపై మూడు గంటలపాటు ధర్నా చేపట్టారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సూసైడ్ నోట్లోని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు  డీఎస్పీ అంజయ్య తెలిపారు.

Also read

Related posts