SGSTV NEWS online
Andhra PradeshCrime

హిడ్మా డైరీలో కీలక విషయాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్టులు!


విజయవాడ, కాకినాడతోపాటుగా మరికొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను పోలీసులు గుర్తించారు. తాజాగా పలు ప్రాంతాల్లో మావోలను అదుపులోకి తీసుకున్నారు.
ఓ వైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లాతోపాటుగా విజయవాడ, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో మావోల కదలికలను గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది ఉన్నారేమో అనే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

విజయవాడలో మావోయిస్టులు ఉన్నారనే విషయం తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే కూలీలుగా చెప్పుకొని వారు అద్దెకు ఉంటున్నట్టుగా తెలిసింది. పెనమలూరులో భవనం అద్దెకు తీసుకున్నారని సమాచారం. షెల్టర్ జోన్‌గా మార్చుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా అడవుల్లో ఉన్న మావోయిస్టులపై బలగాలు దాడి చేస్తున్నాయి. దీంతో సిటీలో ఉంటూ మావోలు సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు కానూరు కొత్త ఆటోనగర్‌లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్‌లో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్టుగా అధికారులకు సమచారాం వచ్చింది. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లుగా పోలీసులకు తెలిసింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేయడాన్ని గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో ఓ ఇంట్లో 27 మంది అద్దెకు ఉంటున్నారు. వారిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. అయితే మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్ దగ్గర హిడ్మా డైరీ దొరికిందని అందులో ఉన్న సమాచారం ఆధారంగానే సెర్చ్ ఆపరేషన్ జరిగిందని అంటున్నారు. ఇందులో పలు కీలక విషయాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. డైరీలో షెల్టర్ల గురించిన సమాచారం రాసుకున్నారా? లేదంటే ఎలాంటి విషయాలు ఉన్నాయనే విషయం తెలియాల్సి ఉంది.


Also Read

Related posts