ఏపీ ఫైబర్ నెట్లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు.
అమరావతి: ఏపీ ఫైబర్ నెట్లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పూ భరద్వాజ, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేశ్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో నిర్వహించి మీడియా సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడారు.
“సంస్థలో 400 మందిని తొలగించాలని ఆదేశాలిచ్చినా వారు పట్టించుకోలేదు. ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై ఫైబర్ నెట్ ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదు. ఉద్యోగులకు జీతాల రూపంలో సంస్థ సొమ్ము చెల్లించారు. ఫైబర్ నెట్కు జీఎస్టీ అధికారులు రూ.377 కోట్లు జరిమానా విధించారు. గత నెలలో జరిమానా విధించినా అధికారులు నా దృష్టికి తీసుకురాలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఫైబర్ నెట్లో పురోగతి లేదు. సంస్కరణలు తేవాలని చూస్తున్నా అధికారులు సహకరించడం లేదు. రూపాయి కూడా ఆదాయం తీసుకురాలేకపోయాం. 8 నెలల్లో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాం. మేం నిర్ణయం తీసుకున్నాక అనుమతి ఇచ్చేందుకు జాప్యం ఎందుకు?
ఫైబర్నెట్ను చంపేయాలని దినేశ్కుమార్ భావిస్తున్నారా?
ఫైబర్నెట్ సంస్థ ఇప్పటికే కష్టాల్లో ఉంది. ఎండీగా దినేశ్కుమార్ ఆగస్టులో వచ్చినా ఒక్కరోజూ సమీక్షించలేదు. ఆయన ఒక ఆపరేటరన్నూ కలవడం లేదు. ఈ ప్రభుత్వంపై జరుగుతున్న కుట్ర అనుకోవాలా? ఫైబర్నెట్ను చంపేయాలని దినేశ్కుమార్ భావిస్తున్నారా? గత ప్రభుత్వంలో ఉన్నట్లే ఆయన పనిచేస్తున్నారు. కనీసం టార్గెట్లు పెట్టడం లేదు. సంస్థ ఆదాయం పెంచేందుకు ప్రయత్నించడం లేదు.
ఫైబర్నెట్ సిబ్బందికి అక్రమంగా 3 నెలలు జీతాలు చెల్లించారు. జీతాల మొత్తాన్ని ఎండీ దినేశ్కుమార్, ఉన్నతాధికారుల నుంచి వసూలు చేయాలి. మొత్తం రికవరీ చేయాలని అడ్వకేట్ జనరల్, సీఎస్కు లేఖ రాస్తా. ఆదాయపన్ను చెల్లింపులోనూ జాప్యం చేశారు. నేను విషయం కనుక్కుని చెల్లించి రూ.30కోట్లు ఆదా చేశా. 2019-24 మధ్య అక్రమాలపై విజిలెన్స్ విచారణకు సహకరించలేదు. ఫైబర్నెట్ అధికారులు ఎలా పనిచేస్తున్నారనేందుకు ఇవన్నీ నిదర్శనం.
ఉన్నతాధికారులు రాజద్రోహం చేస్తున్నారు.. ఇది క్షమించరాని నేరం” అని జీవీ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





