SGSTV NEWS
Andhra Pradesh

నేను హోంశాఖ తీసుకుంటే యుపి సిఎం యోగి తరహాలో వ్యవహరిస్తా : పవన్‌ కల్యాణ్‌



కాకినాడ  (పిఠాపురం) : తాను హోం శాఖను తీసుకుంటే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తరహాలో వ్యవరిస్తానని ఏపీ డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అత్యాచార ఘటనలపై హోం మంత్రి అనిత పట్టించుకోకపోతే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని,  తాను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని పవన్ హెచ్చరించారు. హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.  క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోందంటూ మీడియా ముఖంగా పోలీసు అధికారులను నిలదీశారు. అత్యాచార నిందితుల అరెస్టుకు కులం అడ్డొస్తోందా ? అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు చాలా కీలకమైనవని, పోలీసులు పదే పదే తమతో చెప్పించుకోకూడదని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సమాజంలో చిచ్చు పెట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి భావ ప్రకటనా స్వేచ్చ అంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

మూడేళ్ల బిడ్డను అత్యాచారం చేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా ? : పవన్‌
తాను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని, పర్యాటక శాఖ మంత్రిననీ…, హోం శాఖ మంత్రిని కాదనీ,  పరిస్థితులు చేయి దాటితే హోం శాఖను తీసుకుంటానని పవన్‌ కళ్యాణ్‌ సంచలన వాఖ్యలు చేశారు. తాను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. ”తమను విమర్శించే నాయకులందరికీ ఈరోజు చెబుతున్నా.. ఇలాగే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండండి. హోంశాఖ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ మాత్రం ధైర్యం లేనప్పుడు పోలీసులు ఉండటం ఎందుకు.? ” అని వ్యాఖ్యానించారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదన్నారు. ఒకరిని అరెస్ట్‌ చేయాలంటే కులం సమస్య వస్తుందట.! మూడేళ్ల ఆడబిడ్డను అత్యాచారం చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా ? అని నిలదీశారు.

ఇళ్లలోకి వెళ్లి మహిళపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు : పవన్‌
తాను హోం శాఖను తీసుకుంటే ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తరహాలో వ్యవరిస్తానని పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ” డీజీపీ గత ప్రభుత్వంలా వ్యవహరించకూడదు, బాధ్యత తీసుకోండి, పాత పద్ధతులు పాటిస్తాం అంటే చూస్తూ ఊరుకోను ” అని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన పదవి ఇది అని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎన్నిసార్లు చెప్పినా క్రైం రేటు తగ్గించడానికి అరకొర చర్యలతో సరిపెడుతున్న పోలీసుల తీరుపై పవన్‌ మండిపడ్డారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పనిచేయలేదని, అందుకే ఆ పరిణామాలను ఇప్పుడు చూస్తున్నామన్నారు. సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి మహిళపై అత్యాచారం చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గత ఐదేళ్లలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి సీఎం మాట్లాడలేదనీ, అప్పులు ఎలా వారసత్వంగా వచ్చాయో.. గత ప్రభుత్వ తప్పిదాలూ అలానే వచ్చాయని ఎద్దేవా చేశారు. అప్పుడు చేసిన నేరాలు, అలసత్వం కూడా ఇప్పటికీ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలు బలంగా అమలు చేయాలని పదేపదే చెప్పాననీ, శాంతిభద్రతల పరిరక్షణ అనే అలవాటు అధికారులకు తప్పిందని తీవ్ర స్థాయిలో పవన్‌ విమర్శించారు. గత ప్రభుత్వంలో పోలీస అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారనీ, ఇవాళ ధర్మబద్ధంగా చేయాలని ప్రాధేయపడుతున్నా మీన మేషాలు లెక్కిస్తుండడం సరికాదని హితవు పలికారు. పోలీసు అధికారులు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

తప్పులు చేసినవారిని మడతపెట్టి కొట్టండి : పవన్‌
పోలీసు అధికారులు చదువుకుంది ఐపీఎస్‌ కాదా ? భారతీయ శిక్షాస్మృతి ఏం చెబుతోంది.. క్రిమినల్స్‌ ను వెనకేసుకు రావాలని శిక్షాస్మృతి చెబుతోందా ? అని పవన్‌ ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెగేదాకా లాగొద్దు అన్నారు. ఈ ప్రభుత్వానికి సహనం ఎంత ఉందో తెగింపు కూడా అంతే ఉందని హెచ్చరించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నామన్నారు. ప్రజల ఆవేదనను ఇలా డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కీలకమైందని ఎస్పీలు, కలెక్టర్లకు కూడా చెబుతున్నానన్నారు. ఉన్నతాధికారులు పదేపదే తమతో చెప్పించుకోవద్దు అని హితబోధ చేశారు. ” తప్పులు చేసిన వారిని నా బంధువు, నా రక్తమని ఎవరైనా చెబితే మడతపెట్టి కొట్టండి. నేను ఎవరినీ వెనకేసుకుని రావడం లేదు ” అని పవన్‌ స్పష్టం చేశారు.

హోం మంత్రి బాధ్యత తీసుకోవాలి : పవన్‌
హోం మంత్రి అనితకు కూడా చెబుతున్నా మంత్రిగా ఆమె బాధ్యత తీసుకోవాలని పవన్‌ అన్నారు. ఆడబిడ్డల మానప్రాణాల రక్షణకు బాధ్యత తీసుకోవాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా పోలీసు శాఖ ఉండకూడదని చెప్పామన్నారు. అప్పుడున్న అధికారులే కదా ఇప్పుడున్నది. మిమ్మల్ని మీరు కంట్రోల్‌ చేసుకుంటారా.? లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని నేరస్తులను హెచ్చరించారు. ఆడబిడ్డల మాన, ప్రాణ సంరక్షణ బాధ్యత పోలీసు ఉన్నతాధికారులు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో లాగా అలసత్వంగా ఉంటే సహించేది లేదని పోలీసు అధికారులను హెచ్చరించారు. ఒకరిద్దరు ఇబ్బంది పెట్టినా కానీ ఈ కూటమిని చెడగొట్టలేరని అన్నారు. వ్యక్తి స్వార్థానికి అలయన్స్‌ చెడగొట్టలేరని.. అది జరగనిది అని చెప్పారు. ప్రజలకు అండగా ఉండేది. ఈ కూటమి ప్రభుత్వమే అని తెలిపారు.

త్వరలో పిఠాపురం నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి సంస్థ : పవన్‌
” నన్ను ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత మీది. సమస్యలు మీ నోటి నుంచి వస్తే దానికి పరిష్కారాలు కచ్చితంగా చూపెడతా. పిఠాపురం నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. అనేక పనులు మొదలుపెట్టాం. నియోజకవర్గాన్ని ఒక మోడల్‌ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం. త్వరలోనే పిఠాపురం నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి తద్వారా నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం ” అని పవన్‌ కళ్యాణ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ” ఇసుకను బకాసురులు మింగారు. ఇసుక డబ్బు సంపాదనకు ఒక మార్గం అయ్యింది. ఇసుక మీ ఇళ్ళ నిర్మాణాలకు కావాలంటే మీరు చార్జీలు లేకుండా వాహనాన్ని తీసుకువెళ్ళి తెచ్చుకోవచ్చు ” అని తెలిపారు. చేబ్రోలు పట్టు రైతుల సమస్యపై అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ సెరికల్చర్‌ స్టేట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ బృందం వచ్చారనీ, వాళ్లు సమస్య మీద అధ్యయనం చేస్తారని పవన్‌ తెలిపారు. పంట నష్టపోయిన రైతులకి తక్షణ సాయంగా రూ.11లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అరబిందో ఫార్మా, దివిస్‌ లాబరేటరీస్‌ వల్ల మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోందని అన్నారు. లాభాల బాటలో నష్టాలు జరుగుతున్నాయన్నారు. సదరు కంపెనీలు సమస్యలు లేవని అంటున్నారనీ, సమస్యలు ఉన్నాయో లేవో తనకు తెలుసు అన్నారు. అందుకే తనను పారిశ్రామిక వేత్తలు కలిసేందుకు అవకాశం ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఏ రోజైతే సంతోషంగా ఉంటారో పరిశ్రమల వల్ల సమస్యలు రావో ఆరోజే పారిశ్రామికవేత్తలను కలుస్తాను అని అన్నారు. మత్స్యకారులు మత్స్య సంపద నష్టపోకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకొని ఫార్మా కంపెనీల ప్రతినిధులు, మత్స్యకార నాయకులు, మత్స్యకారులతో చర్చలు జరపాలని పవన్‌ వివరించారు.



సెజ్‌ రైతుల సమస్యలకు పరిష్కారం…
కాకినాడ సెజ్‌ లో రైతుల సమస్యలు ఉన్నాయని, అక్కడ జరిగిన గొడవలు కూడా తనకు తెలుసునని పవన్‌ అన్నారు. ఏ ఉద్దేశంతో అయితే రైతులు దగ్గర నుంచి భూములు తీసుకున్నారో ఆ ఉద్దేశం నెరవేరలేదన్నారు. అనేకమంది రైతులకి పూర్తిస్థాయిలో నష్టపరిహారం లేదని అరబిందో ఆ బాధ్యతలు తీసుకొని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సెజ్‌ లో 1200 ఎకరాలు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం చెప్పిందని కానీ టెక్నికల్‌ కారణాలతో రిజిస్ట్రేషన్‌ ఆగిపోయిందని టెక్నికల్‌ సమస్యలు పరిష్కరించి రైతులకు భూములను అప్పగించాలని అధికారులను ఆదేశించారు.



గత ప్రభుత్వం తాలూకా వారసత్వమే..
రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలకు గత ప్రభుత్వ తాలూకు వారసత్వమే కారణమన్నారు. గతంలో తన మీద తన కుటుంబ సభ్యుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసి మానభంగాలు చేస్తామని బెదిరించినా సరే పోలీసులు స్పందించలేదన్నారు. వైసిపి వాళ్ళు.. తనపై, తన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలాలతో పోస్టులు పెట్టినా సరే పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారన్నారు. మానభంగాలు చేస్తాం చంపేస్తామని బెదిరిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైందన్నారు. పోలీసులు కూడా తమ విధులు నిర్వహించలేదని అనేక సార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. కూటమి ఎమ్మెల్యేలు అందరూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను పరిశీలించాలని, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవాలని కోరారు. కేవలం తన పార్టీ ఎమ్మెల్యేలకే కాకుండా కూటమిలోని మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నానన్నారు. బాలికల వసతి గృహాల్లో జరిగిన అనేక విషయాలు తన దృష్టికి వచ్చాయని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.,

Also read

Related posts

Share this