SGSTV NEWS
Andhra PradeshCrime

ఎంత పని చేశావు తల్లి!..మనోవేదనతో భార్య ఆత్మహత్య

40 రోజుల క్రితం అనారోగ్యంతో భర్త మృతి

అనాథలుగా మారిన ఇద్దరు కుమార్తెలు



చాగలమర్రి(నంద్యాల): ఇద్దరు చిన్నారులు.. ఒకరికి నాలుగేళ్లు, మరొకరికి ఏడేళ్లు.. తండ్రి అకాల మరణం చెందారు. ఇక పిల్లల భారమంతా తల్లిదే. కుమార్తెల ఆలనా..పాలనా చూసుకోవాల్సిన ఆమె మనోవేదనతో తీసుకున్న నిర్ణయం ఇద్దరి పిల్లలను అనాథగా మార్చేసింది. భర్త లేని లోకంలో తాను ఉండలేనంటూ ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మండల కేంద్రం చాగలమర్రిలో చోటు చేసుకుంది. స్థానిక న్యూ బిల్డింగ్స్ కాలనీలోని రోసిరెడ్డి రైస్ మిల్ వీధిలో నివాసం వుంటున్న పవన్ కుమార్(40) నిత్యావసర వస్తువుల ఏజెన్సి నిర్వహిస్తూ 40 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని భార్య మహేశ్వరమ్మ(30) ఇద్దరు కుమార్తెలు జాహ్నవి (7), హర్షిత (4)తో కలసి తండ్రి కృష్ణమూర్తి చెంత ఉంటోంది

కృష్ణమూర్తికి మతిస్థిమితం లేదు. కొన్నాళ్ల క్రితం అతని భార్య కూడా మృతి చెందింది. మరో వైపు పవన్ కుమార్ తల్లిదండ్రులు కూడా మృతి చెందారు. అటు భర్త తరఫు, ఇటు తన తరఫు అండగా నిలవాల్సిన ఎవరూ లేకపోవడంతో భర్త చనిపోయినప్పటి నుంచి మహేశ్వమరమ్మ తీవ్ర ఆందోళన చెందింది. చివరకు మనోవేదనతో ఆదివారం అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఓ గదిలోకి వెళ్లి నిప్పంటించుకుంది. ఇంట్లో మంటలు కనిపించడం, పెద్దగా కేకలు రావడంతో ఇరుగు పొరుగున ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ సురేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఇంటి లోపల వైపు గడియ పెట్టి ఉండటంతో ఇంటిపై నుంచి పోలీసులు లోపలికి ప్రవేశించి సోఫాలో నిద్రిస్తున్న పిల్లలిద్దరిని, ఆమె తండ్రిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మహేశ్వరమ్మ పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. తల్లి మృతితో రోదిస్తున్న చిన్నారులను చూసి పలువురు కంట తడి పెట్టారు. ప్రస్తుతం దూరపు బంధువు వద్ద ఆ చిన్నారులు ఉన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share this