విశాఖపట్నం: జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డుప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య గాయాలతో బయటపడింది. పీఎంపాలెం సీఐ జి. బాలకృష్ణ తెలిపిన వివరాలివి.
కొమ్మాది శివశక్తినగర్‌కు చెందిన ఎస్. బలరామ్ (58) గాయత్రీ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన తన భార్య తులసమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై మధురవాడ నుంచి ఆనందపురం వైపు బయలుదేరారు. పరదేశిపాలెం కూడలి వద్దకు చేరుకోగానే, విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బలరామ్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు.
వెనుక కూర్చున్న భార్య తులసమ్మకు గాయాలయ్యాయి. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన ఆమె, తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ మృతదేహంపై పడి బోరున విలపించడం సంఘటన స్థలంలో ఉన్న వారిని కంటనీరు పెట్టించింది. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రురాలు తులసమ్మను చికిత్స నిమిత్తం గాయత్రీ ఆసుపత్రిలో చేర్పించారు. బలరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





