నిజం దాచి పెట్టింది సునీతే.. అసత్య ప్రచారం చేస్తోంది సునీతే
వివేకా కేసులో అవినాష్ రెడ్డి సంచలన కౌంటర్
ప్రత్యర్థుల నోళ్లు మూతలు పడేలా పకడ్బందీ ఆధారాలతో కౌంటర్
అన్నీ వేళ్లు సునీత, నర్రెడ్డి వైపే చూపిస్తున్నాయన్న అవినాష్
ఎన్నికల వేళ తప్పుడు ఆరోపణలు ఎవరి స్కెచ్ అందరికి తెలుసని చురకలు
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత ఏ రకంగా అబద్దాల ప్రచారం చేస్తుందో.. పూర్తి వివరాలు, ఆధారాలతో బయటపెట్టారు. ఇష్టానుసారంగా బురద జల్లి.. కేసు విచారణను పక్కదోవ పట్టించేలా సునీత ఏ రకంగా ప్రయత్నిస్తుందో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివరించారు. ఈ కేసులో మాట్లాడకూడదని భావించినా.. రోజురోజుకి పెరుగుతున్న అబద్దాలను, అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వివరణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆయన వెల్లడించిన అంశాల్లో అతి ముఖ్యమైన అయిదు అంశాలు చూద్దాం.
పాయింట్ 1 : పన్నింటి రాజశేఖర్‌ను బయటకెందుకు పంపించారు?
వివేకా ఇంట్లో పని చేసే వ్యక్తి పన్నింటి రాజశేఖర్. హత్యకు ఒక రోజు ముందు పన్నింటి రాజశేఖర్‌కు సౌభాగ్యమ్మ ఫోన్ చేసింది. సిబిఐ విచారణలో పన్నింటి రాజశేఖర్‌ను సుదీర్ఘంగా విచారించారు. లిఖితపూర్వకంగా పన్నింటి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అవినాష్ చదివి వినిపించారు. పన్నింటి రాజశేఖర్‌ను సిబిఐ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు.. ప్రశ్న, సమాధానాలు ఇలా ఉన్నాయి
సిబిఐ : నీకు సెలవు ఎవరు మంజూరు చేశారు?
పన్నింటి రాజశేఖర్ : నాకు సౌభాగ్యమ్మ సెలవు ఇచ్చింది
సిబిఐ : నీవు సెలవుపై వెళ్లాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా?
పన్నింటి రాజశేఖర్ : నాకు రెండు, మూడు సార్లు సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్ చేశారు, తక్షణం నువ్వు కాణిపాకం వెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. సరేనని నేను సెలవు తీసుకున్నా..
పన్నింటి రాజశేఖర్ : సునీల్ యాదవ్, ఉమా శంకర్, గంగిరెడ్డి ముగ్గురు కూడా వివేకానందరెడ్డికి చాలా క్లోజ్. చనిపోక ముందు వివేకాతో కలిసి ప్రయాణాలు చేసేవారు. వాళ్లకు వివేకాతో ఎంత సాన్నిహిత్యం ఉందంటే.. అంతా కలిసి తరచుగా అంటే రెండు మూడు రోజులకోసారి టేబుల్ మీద కూర్చుని భోజనాలు చేసేవారు. రెండు రోజుల ముందు కూడా వివేకాతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు.
అవినాష్ అభ్యంతరం : ఇంట్లో ఉన్న పన్నింటి రాజశేఖర్‌ను నర్రెడ్డి రాజశేఖర్, సౌభాగ్యమ్మ (తమ్ముడు, అక్క) ఎందుకు బయటకు పంపించారు? కాణిపాకం వెళ్లమని ఎందుకు ఒత్తిడి తెచ్చారు? వివేకానందరెడ్డికి సునీల్ యాదవ్, ఉమాశంకర్, గంగిరెడ్డి తెలియదని సునీత ఎందుకు ప్రకటనలు చేస్తోంది? ఇంట్లో కలిసి కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేసే సాన్నిహిత్యం ఉందని పని వాళ్లంతా చెబుతుండగా.. సునీత ఎందుకు మాట మారుస్తోంది?
—
పాయింట్ 2 : గుండెపోటు థియరీ ఎక్కడినుంచి వచ్చింది?
గుండెపోటు థియరీ గురించి సునీతతో చాలా మాట్లాడుతోంది. అసలు ఈ థియరీ ఎక్కడి నుంచి మొదలయింది. దీని గురించి వివరంగా మాట్లాడుదాం.
సిట్‌కు సునీత ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో స్పష్టంగా ఏమని పేర్కొన్నారంటే..!
“మాకు ఉదయం కృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, ఇంట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చెప్పాడు. మా నాన్న డెడ్‌బాడీ బాత్‌రూంలో పడి ఉంది. మా నాన్న ఒంటిపై గాయాలున్నాయని చెప్పాడు, అయితే మా నాన్నకు గతంలో గుండె సమస్య ఉంది, బహుశా గుండె పోటు వచ్చి బాత్‌రూంలో కింద పడి మా నాన్నకు గాయాలయ్యాయేమో అని ఊహించి ఆ విధంగా ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డికి మేం సూచించాం” అని నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తాము ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు. సిట్‌కు సునీత ఇచ్చిన స్టేట్‌మెంట్. అంటే కృష్ణారెడ్డితో ఏమేం మాట్లాడారో సునీత ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. పైగా ఘటన జరిగిన వారంలోపు అంటే.. ఆలస్యం కాకుండా బయటికొచ్చే విషయాలు పక్కగా ఉంటాయని ఢిల్లీలో ప్రెస్ మీట్‌లో చెప్పింది సునీత.
అవినాష్ పాయింట్ : గుండెపోటు కాదు, శరీరం మీద గాయాలున్నాయన్న విషయం సునీతకు అందరికంటే ముందే.. కృష్ణారెడ్డి ఫోన్ చేయగానే తెలిసింది. అయినా సునీత మధ్యాహ్నం వరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. హైదరాబాద్ నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సౌభాగ్యమ్మ.. అంతా బయల్దేరి కలిసి వచ్చారు. అక్కడ లెటర్ ఉందని తెలిసి, దాన్ని దాచి పెట్టమని చెప్పి, వివేక హత్యకు గురయ్యాడన్న విసయాన్ని దాచిపెట్టింది సునీత. అందరికంటే ముందు డెడ్‌బాడీ ఫోటోలు కూడా తెప్పించుకున్నారు, అయినా పోలీసులకు చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా అసలు నిజాలను దాచిపెట్టింది సునీత, ఆమె భర్త.
ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం.. ఏంటంటే.. నన్ను ఇరికించే కుట్ర జరిగిందని. శివప్రకాష్ రెడ్డి..అంటే వివేకా సొంత బావమరింది నేను ఉదయం లేచి రాజకీయ పర్యటన కోసం బయటకు వెళ్తోంటే.. నాకు ఫోన్ చేసి ఏం చెప్పినాడంటే.. “బావ చనిపోయాడు.. అర్జంటుగా ఇంటికి వెళ్లాలని చెప్పాడు”. అదే విషయం నేను నా వాంగ్మూలంలో చెప్పాను. నేను అదుర్తాతో వివేకానంద ఇంటికి వెళ్లగానే అక్కడ తేడా ఉందన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. అనుమానం ఉందని చెప్పాను.
మరి ఉదయమే హత్య అని తెలిసినా.. సునీత గానీ, నర్రెడ్డి గానీ, శివప్రకాష్ రెడ్డి గానీ.. పోలీసులకు ఎందుకు చెప్పలేదు? పైగా ఏమి తెలియనట్టు నాకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాలని ఎందుకు చెప్పినట్టు?
మీరు ఇదే అంశంలో టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూడాలి (వీడియో క్లిప్ ప్లే చేసి వినిపించారు)
సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆదినారాయణ ఏమన్నాడంటే…
“మార్చి 15 నాడు నేను విజయవాడలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేసినాడు, గుండెపోటుతో చనిపోయాడని నాకు చెప్పినాడు, ఆ రోజు మా కజిన్, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి కూడా నాతో ఉన్నాడు. ఎందుకని నేను అడిగినప్పుడు.. ఎక్కువగా సిగరేట్లు తాగుతాడని, గుండె పోటు వచ్చి స్టంట్ కూడా వేశారని చెప్పాడు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను. నన్ను దర్యాప్తులో నీకు పరమేశ్వర్ రెడ్డి తెలుసా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు.”
అవినాష్ పాయింట్ : గుండెపోటు అన్న తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందెవరు? ఎక్కడి నుంచి మొదలయ్యిందో ఈ ఆధారాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
—
పాయింట్ 3 : ఎంపీ టికెట్ కోసం హత్య చేశారని తప్పుడు ప్రచారం
అటు సునీత, ఇటు షర్మిల.. హఠాత్తుగా రాజకీయాలను తీసుకొచ్చారు. ఏంటంటే.. కడప ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందట. ఎంపీ టికెట్ మోటివ్ అన్న దాంట్లో నిజమెంత? ఒక్కసారి జరిగిన ఘటనలను మీరే చూడండి. “తాను చనిపోయే చివరి క్షణం వరకు నా కోసం ప్రచారం చేశారు, మూడు గంటల ర్యాలీ సభలో వివేకా మాట్లాడారు. అవినాష్‌ను గెలిపించమని పది సార్లు చెప్పారు. అంతెందుకు సునీత కూడా ఢిల్లీలో ఏం మాట్లాడారు..? అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రచారం చేశాడని చెప్పింది.” మరి.. అప్పటికే ఎంపీ టికెట్‌ను నాకు కేటాయించారు. 2019 టికెట్ ఒక్కటే కాదు.. 2014లోనూ నేను ఎంపీగా గెలిచాను. నా కోసం వివేకానంద ప్రచారం కూడా చేశారు.
మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం హత్య జరిగింది అని ఎలా చెబుతారు?
పైగా అప్పుడు మీ నాన్నకు ప్రత్యర్థి బీటెక్ రవి ఇప్పుడు మీకు సన్నిహితుడు అవుతాడా?
మీ నాన్న మీద అక్రమంగా, అనైతికంగా గెలిచిన బీటెక్ రవి కాకుండా.. మా మీద బురద వేస్తున్నారా?
కనీసం అవగాహనతో మాట్లాడుతున్నారా?
మీ కోసం ఎన్నో ఎన్నికల్లో కష్టపడితే మాపై ఆరోపణలు చేస్తారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ఏ ఒక్కరినీ సిబిఐ ఎందుకు ప్రశ్నించలేదు?
సిబిఐ దర్యాప్తులో ఇన్ని లోపాలుంటాయా?
ఇక సునీత, సిబిఐ చాలా మందితో తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించారు. ఇంకా చాలా ప్రయత్నాలు జరిగాయి. లక్ష్మీదేవమ్మ, జగదీష్ రెడ్డి, లక్ష్మీ దేవి కొడుకుతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే ప్రయత్నాలు చేశారు.
శశికళ & కోతో కూడా తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నాలు చేశారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు గేటు దగ్గర ఇప్పకుంట్ల వాసి ఒకరు ఉంటే.. ఆయన ఇంటికి సునీత, రాజశేఖర్ వెళ్లారు. “మా నాన్న దగ్గరి వాడివి, సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలి, మేం చెప్పినట్టు మాత్రమే నువ్వు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు, ఏం చెప్పారంటే.. అవినాష్ గుండెపోటు అని చెప్పమన్నాడని నువ్వు చెప్పాలి” అని ఒత్తిడి తెచ్చారు.
అవినాష్ పాయింట్ : సునీత లాంటి వాళ్లు దస్తగిరి లాంటి వారిని కూడా అప్రూవర్‌గా చేయగలరు, ఇందులో చంద్రబాబు కుట్ర, కుతంత్రాలు కావొచ్చు, అందులో భాగంగానే పస లేని విమర్శలు, కనికట్టు చేసే అబద్దాలు ఉన్నాయి. రాజకీయంగా దీన్ని ముడిపెట్టి అవినాష్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు ఇంత కుట్ర చేస్తారా? గుండెపోటు అని ప్రచారం మొదలెట్టిన వాళ్లు… దాన్ని నా మీద రుద్దుతారా? పైగా ఇంటింటికి వెళ్లి నేను చెప్పమన్నారంటూ ఒత్తిడి తెస్తారా?
ఈ కేసులో కోర్టులమీద నమ్మకం ఉందని, చంద్రబాబు, బీజేపీలోని టిడిపి పెద్దలు దీని వెనక ఉన్నారని విమర్శించారు అవినాష్. చంద్రబాబు చేతిలో పావులుగా మారి నన్ను, మా నాన్నను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్‌విచ్ మీన్‌టైంకు ఇండియన్ స్టాండర్డ్ టైంకు తేడా లేకుండా తప్పుడు ప్రకటనలు చేసిన సిబిఐ.. తర్వాత నాలుక కర్చుకుని హైకోర్టులో కౌంటర్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు.
వివేకా కేసులో సునీత, దస్తగిరి లాలూచీ పడ్డారు: ఎంపీ అవినాష్
Also read
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం