November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

మాయమాటలు చెప్పి 20 రోజులుగా హోటల్లోనే బాలికను బంధించిన కేటుగాడు

ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణానికి చెందిన ఓ యువతిని ట్రాప్ చేశాడు. 20 రోజుల పాటు నారాయణగూడలోని ఓ హోటల్ గదిలో బంధించి లైంగిక వాంచ తీర్చుకున్నాడు.

Crime News: హైదరాబాద్ నగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను నమ్మించి హోటల్ గదిలోనే 20రోజులు బంధించాడు ఓ కేటుగాడు. ఎలాగోలా సమాచారం అందుకున్న షీ టీమ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం ఆ బాలికకు విముక్తి కలిగించారు.  నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన బాలికకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతని ఉచ్చులో చిక్కుకున్న బాలికకు మాయమాటలు జెప్పి నమ్మించి హైదరాబాద్ కు రప్పించాడు.

అసలేం జరిగిందంటే..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కృష్ణచైతన్య హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కోర్సు చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణానికి చెందిన ఓ యువతిని ట్రాప్ చేశాడు.పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ తీసుకొచ్చాడు.20 రోజుల పాటు నారాయణగూడలోని ఓ హోటల్ గదిలో బంధించి లైంగిక వాంచ తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలి బాలిక కోరగా హోటల్ గదికి తాళం వేసి పరారయ్యాడు.బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి లైవ్ లొకేషన్‌ను షేర్ చేసింది.తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో వారు లొకేషన్ ద్వారా నారాయణగూడలోని హోటల్ కు వెళ్లి యువతిని రక్షించారు. యువతి ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు నిందితుడు కృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.సదరు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.


హోటల్స్ లో సీక్రెట్ కెమెరాలు
ఇటీవల నగరంలోని హోటల్స్ నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యాల సాయంతోనే నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇటీవల అలాంటి ఓ కేసు సంచలనంగా మారింది. శంషాబాద్‌లోని ఓ హోటల్ యజమాని అశ్లీలవీడియోలకు బానిసయ్యాడు. అదే వంకర బుద్ధితో హోటల్ గదుల్లో చిన్న చిన్న కెమెరాలు అమర్చాడు. అక్కడికి వస్తున్న ప్రేమ జంటల వీడియోలను తీసి వాటని చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఏడాది నుంచి వందల కొద్దీ వీడియోలు సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ట్రయల్ రూంలో స్పై కెమెరాను ఓ మహిళ గమనించి యజమానికి ఫిర్యాదు చేసింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి అది ఏర్పాటు చేసినట్లు గుర్తించి ఆ మహిళకు కొంత పరిహారం అందించి  పంపించేశాడు.

రహస్య కెమెరాలతో భయాందోళనకు గురిచేస్తున్న షాపింగ్ మాల్స్, హోటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బాధితులు ఎవరైనా ఉంటే డయల్ 100కు ఫోన్ చేయాలని.. మరోవైపు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న స్పై కెమెరాల ద్వారా బగ్ డిటెక్టర్ ద్వారా గుర్తించే అవకాశం ఉందని ఆయన సూచించారు. అయితే మహిళాల  భద్రత విషయంలో రాజీ పడేది లేదని సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via