SGSTV NEWS online
CrimeNational

అరుణాచలం గిరి ప్రదక్షిణలో గ్యాంగ్ రేప్.. సీఎం విజయ్ సీరియస్.. సంచలన ఆదేశాలు!


తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం) గిరి ప్రదక్షిణ బాటలో చోటుచేసుకున్న అఘాయిత్యాలు కలకలం రేపాయి. గిరి ప్రదక్షిణకు వచ్చిన ఇద్దరు యువతులపై వేర్వేరు ఘటనల్లో ఒకే ముఠా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం) గిరి ప్రదక్షిణ బాటలో వరుసగా చోటుచేసుకున్న ఘోర అఘాయిత్యాలు తీవ్ర కలకలం రేపాయి. గిరి ప్రదక్షిణకు వచ్చిన ఇద్దరు యువతులపై వేర్వేరు ఘటనల్లో ఒకే ముఠా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పౌర్ణమి వేళ స్వామివారి దర్శనానికి , గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తుల భద్రతను ప్రశ్నించేలా సాగిన ఈ అటవిక చర్యలు స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే నెల 30వ తేదీ రాత్రి ధర్మపురి ప్రాంతానికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి అరుణాచలం గిరి ప్రదర్శణకు వెళ్లింది. అనంతరం తిరిగి వచ్చే క్రమంలో వారు పెద్దకోలాపాడి వద్ద ఆగి మాట్లాడుతుండగా, మారణాయుధాలతో వచ్చిన దండగుల ముఠా వారిని బెదిరించి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, బాధితుల దుస్తులు లాక్కొని నగ్నంగా వీడియోలు తీశారు. ఆపై రూ. లక్ష ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సరిగ్గా మరుసటి రోజు (మే 31) రాత్రి, తిరువణ్ణామలైకే చెందిన 23 ఏళ్ల మరో యువతి తన స్నేహితుడితో కలిసి అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్ద ఉన్న సమయంలో అదే ముఠా వారిని కూడా అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి, చిత్రహింసలు పెట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టింది. వారిని సైతం నగ్నంగా వీడియోలు తీసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు.

ఈ దారుణ ఘటనలపై బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న తిరువణ్ణామలై పడమర పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలు, బాధితుల వివరాల సాయంతో ఈ ఘాతుకాలకు పాల్పడింది మొత్తం 11 మంది సభ్యుల ముఠాగా గుర్తించారు. మంగళవారం రాత్రి జరిపిన మెరుపు దాడుల్లో వాసుదేవన్, ఆకాష్, అప్పు, హరిహరన్, శర్మ, అరుణ్‌కుమార్, శివగణేశన్‌లతో పాటు ఒక 16 ఏళ్ల మైనర్ బాలుడితో కలిపి మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

మరోవైపు ఈ అమానుష ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణాచలం ఘటనపై ఉన్నతస్థాయి నివేదిక కోరిన సీఎం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణను మరింత వేగవంతం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో మహిళల రక్షణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఆయన, “మహిళలను కన్నెత్తి చూస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ, అరుణాచలం ఆలయ పరిసరాల్లోనూ, గిరి ప్రదక్షిణ బాటలోనూ యాత్రికుల రక్షణ కోసం అదనపు బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

Also read

Related posts