SGSTV NEWS
Andhra PradeshCrime

Fraud: కమండలం అమ్మితే కమీషన్ అని రూ.3 కోట్ల టోకరా..రైతు నుంచి కొట్టేసిన మోసగాడు




పెనమలూరు, న్యూస్టుడే: మహిమ గల కమండలం  అమ్మితే రూ.కోట్ల కమీషన్ వస్తుందంటూ ఓ రైతు
నుంచి ఏకంగా రూ.3 కోట్లు కొట్టేశాడో కేటుగాడు. ఈ  మోసం కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. పెనమలూరు  సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకిక  చెందిన ఓ రైతుకు విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన కొర్లగుంట లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి 2019లో పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే లక్ష్మీప్రసాద్ మోసం  వల విసిరాడు. విశాఖపట్నంలోని సింహాచలం సమీపంలో  మహిమగల కమండలం ఉందని, దాని విలువ రూ.1,000  కోట్లు అని, దాన్ని అమ్మి పెట్టడం ద్వారా రూ.10 కోట్ల వరకు కమీషన్ వస్తుందని నమ్మబలికాడు.

ఈ విషయంపై సదరు రైతు ఆసక్తి చూపడంతో అతడిని బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్, రాజమహేంద్రవరం తదితర నగరాల చుట్టూ తిప్పి కొందరిని పరిచయం చేశాడు. దాన్ని వారే అమ్ముతారని, అందుకు మనం వారికి కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అది నమ్మిన రైతు విడతల వారీగా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించారు. ఇలా 2019-2025 వరకు రూ.3 కోట్ల వరకు సమర్పించుకున్నారు. అయితే, ఆ రైతుకు కొంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో తాను ఇక ఖర్చు చేయలేనని, ఇప్పటికే అప్పుల పాలయ్యానని లక్ష్మీప్రసాద్కు తెలిపారు. కమండలం అమ్మడం ద్వారా వచ్చే కమీషన్ కూడా తనకు అవసరం లేదని, తాను ఇచ్చిన రూ.3 కోట్లు తిరిగిస్తే చాలని వేడుకున్నారు. అప్పటి నుంచి లక్ష్మీప్రసాద్ బెదిరింపులకు దిగడం మొదలెట్టాడు. మోసపోయినట్లు గుర్తించిన రైతు.. పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this