వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కలేనన్ని నేరాలు.. ఘోరాలకు పాల్పడిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోరు ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల అదుపులో పిన్నెల్లి ప్రధాన అనుచరుడు అడ్డూఅదుపూ లేకుండా గూండాగిరీ టీడీపి నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి కేసులో నిందితుడు
నరసరావుపేట, కారంపూడి (మాచర్ల): వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కలేనన్ని నేరాలు.. ఘోరాలకు పాల్పడిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోర్ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ మల్కాజిగిరిలోని జయపురికాలనీలో అతడిని విజయపురి సౌత్ ఠాణా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడటంతో నమోదైన కేసుల నేపథ్యంలో మే 22న పిన్నెల్లి సోదరులు హైదరాబాద్కు పారిపోయారు. అప్పటి నుంచి వారి అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. తరువాత పిన్నెల్లి సోదరులిద్దరూ ముందస్తు బెయిల్పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా కిశోర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న తన అన్న శ్రీకాంత్ వద్దే ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వస్తున్నాడన్న సమాచారం మేరకు విజయపురి సౌత్ ఠాణా ఎస్సై షఫీ బృందం రెండ్రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లింది. ఈ క్రమంలో ఉదయం కిశోర్ ను , అతని సోదరుడు శ్రీకాంతన్ ను అదుపులోకి తీసుకుని.. మాచర్లకు తీసుకొచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం మాచర్లలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి వారిని విచారిస్తున్నారు. సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కిశోర్ పై మూడు హత్యాయత్నాలతోపాటు మరో ఏడు ఇతర కేసులున్నాయి.
టీడీపి నేతలపై దాడులకు తెగబడి..
గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు మాచర్ల నియోజకవర్గంలోని బొదిలవీడులో టీడీపి వారిని నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. దీంతో పార్టీ ఎన్నికల పరిశీలకులుగా బొండా ఉమ, బుద్ధా వెంకన్నలను చంద్రబాబు అక్కడికి పంపారు. వీరి కారు మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే కర్రలు, కత్తులతో సిద్ధంగా ఉన్న వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. బొండా ఉమ, బుద్ధా వెంకన్నలు ప్రయాణిస్తున్న కారు అద్దాల్లో నుంచి పెద్ద కర్రలతో కిశోర్ వారిపై దాడి చేశాడు. ఈ వీడియోలు అప్పట్లో సంచలనం రేకెత్తించాయి. ఆ దాడిలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తరువాత కిశోర్ ను వైసీపీ అధిష్ఠానం ఏకంగా మున్సిపల్ ఛైర్మన్ ను చేసింది. ఈ పదవిలో సుమారు రెండు సంవత్సరాలు ఉన్నాడు.
టీడీపి కార్యాలయం దహనం కేసులో..
మాచర్లలో టీడీపి శ్రేణులు ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం చేపట్టగా, 2022లో డిసెంబరు 16న టీడీపి కార్యాలయాన్ని దహనం చేశారు. ఈ ఘటనలోనూ కిశోరే ప్రధాన నిందితుడు. టీడీపి కార్యాలయానికి నిప్పు పెట్టడంతోపాటు టీడీపి నేతలు, కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి బంగారం, డబ్బు దోచుకుపోయారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితోపాటు మాచర్ల పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళ్తూ.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, టీడీపి నేతలపై దాడులకు తెగబడ్డారు. పీడబ్ల్యూ కాలనీలో టీడీపి నేత కేశన్రెడ్డిని కారుతో ఢీకొట్టి దాడి చేశారు.
పాల్వాయిగేటు ఘటనలో..
పాల్వాయిగేటు పోలింగ్ బూత్లో టీడీపి ఏజెంటు నంబూరు శేషగిరిరావుపై దాడిలో కూడా కిశోర్ నిందితుడే. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో ఇనుపరాడ్లు, మారణాయుధాలతో రోడ్లపై స్వైరవిహారం చేస్తూ ‘టీడీపి నాయకుల్లో ఎవడో ఒకడిని చంపితేకానీ అందరికీ భయం ఉండదు’ అంటూ అరుస్తూ దాడులకు తెగబడ్డారు. అడొచ్చిన సీఐ నారాయణస్వామిపై దాడి చేశారు. ఈ కేసులో కిశోర్ ను ఏ2గా చేర్చి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇటీవల పిన్నెల్లి మరో అనుచరుడు మన్నెయ్య కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. అలానే కిశోర్ కూడా కోర్టులో లొంగిపోవాలని ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు పట్టుకున్నారు.
Also Read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!