November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

Medchal: రుణమాఫీ కాలేదని.. బలవన్మరణం!



రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ రాలేదని, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఎకరా భూమి అమ్ముదామంటే తల్లి సహకరించలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు.


హైదరాబాద్ – మేడ్చల్, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ రాలేదని, ఆర్థికh ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఎకరా భూమి అమ్ముదామంటే తల్లి సహకరించలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం మేడ్చల్ ప్రభుత్వ వ్యవసాయ కార్యాలయం ఆవరణలో ఉన్న ఇనుప మెట్లకు అతను ఉరేసుకున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన సోలిపేట సురేందర్ రెడ్డి (52) 15 ఏళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చారు. మేడ్చల్లో ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. సొంతూరులో అతనికి 4 ఎకరాల 5 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అలాగే  తన తల్లి సుశీల పేరుమీద ఉన్న ఒక ఎకరాన్ని కూడా తీసుకుని మొత్తం పొలాలను అక్కడున్నవారికి కౌలుకు ఇచ్చారు. ఈ రెండు వ్యవసాయ భూములపై పన్నెండేళ్ల క్రితం రూ.70 వేలు రుణం తీసుకున్నారు. అప్పటి నుంచి రుణం తిరిగి చెల్లించకపోవడంతో అలాగే ఉండిపోయింది. ఈ ఏడాది మార్చి నాటికి సురేందర్రెడ్డి భూమిపై రూ.1.92 లక్షలు, తన తల్లి పేరుమీద ఉన్న మరో రూ.1.15 లక్షలు కలిసి మొత్తం రుణం రూ.3.07 లక్షలకు పెరిగింది. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుండగా తనకు రుణమాఫీ కాలేదని సురేందర్రెడ్డి ఆందోళనకు లోనయ్యారు. అదే సమయంలో తన అన్నకు రూ.1.60 లక్షల రుణం మాఫీ అయింది. మరోవైపు బ్యాంకు అధికారులు సురేందర్రెడ్డి, అతని తల్లి పేరిట ఉన్న రుణం చెల్లించాలంటూ ఫోన్లు చేయడంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఒక ఎకరా భూమి అమ్మేందుకు ప్రయత్నించినా తల్లి అంగీకరించకపోవడంతో సురేందర్రెడ్డి మరింత కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తన చావుకు ప్రభుత్వం, తల్లి కారణమంటూ రాసిన స్లిప్పులు  మృతదేహం వద్ద లభించాయి. పోలీసులు సురేందర్రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా సురేందర్రెడ్డి, అతని తల్లికి ఒకే రేషన్ కార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts

Share via