Eluru Police: ఏలూరు లో నేరాలు నియాత్రణ
లక్ష్యంగా పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా దొంగల ఫోటోలు పోలీస్ స్టేషన్లు లేదా బస్టాండ్లకే పరిమితం అవుతాయి. కానీ ప్రజలలో పూర్తిస్థాయి అవగాహన పెంచేందుకు పోలీసులు నగరంలోని ప్రధాన కూడళ్లు.. ఎంట్రీ పాయింట్లలో పాత నేరస్తుల ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. “నేను మీకు తెలుసా?” అనే వినూత్నమైన క్యాప్షన్ తో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
సోమవరపాడు ఏరియాతో పాటు నగరంలోని నాలుగు ప్రధాన ఎంట్రీ పాయింట్ల వద్ద ఈ ఫ్లెక్సీలను పోలీసులు ప్రదర్శించారు. ఇందులో సుమారు 28 మంది పాత నేరస్తుల ఫోటోలను హెచ్ఎ క్వాలిటీతో ముద్రించారు. చైన్ స్నాచర్లు.. బైక్ దొంగలు.. ఫోన్ దొంగలు.. కాపర్ వైర్ దొంగలుగా వీరిని విడదీసి మరీ వివరాలు వెల్లడించారు. తాడేపల్లిగూడెం.. గుంటూరు.. నరసరావుపేట.. మంగళగిరి.. విజయవాడ వంటి ప్రాంతాలకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల వివరాలు కూడా ఇందులో ఉండటం గమనార్హం. ప్రజలు నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని చూడటం వల్ల నేరస్తులను గుర్తుపట్టడం సులభం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానిక ప్రజలు వేయినోళ్ల కొనియాడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో దొంగల ఫోటోలు ప్రదర్శించడం వల్ల వారు తప్పు చేయడానికి సిగ్గుపడతారని.. ప్రజలు కూడా ఏమరపాటుగా ఉండకుండా జాగ్రత్త పడతారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో దొంగల బీభత్సం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేరాల అదుపునకు ఎంతగానో దోహదపడతాయని సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పోలీసులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన 24 గంటలు గడవకముందే దొంగల ముఠా లేదా వారి అనుచరులు తమ ప్రతాపం చూపారు. పాత బస్టాండ్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉన్న ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం కలకలం రేపుతోంది. తమ ఫోటోలు బయట పడ్డాయన్న కోపంతో నేరస్తులే ఈ పని చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్న ప్రాంతాల్లోనే ఈ విధ్వంసం జరగడం గమనార్హం. ఫ్లెక్సీలను చించిన వారిని గుర్తించేందుకు పోలీసులు సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ప్రజల రక్షణ కోసం పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నేరస్తులకు బహిరంగంగా హెచ్చరికలు పంపడంలో ఏలూరు పోలీసులు సఫలం అయ్యారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చిరిగిన ఫ్లెక్సీల స్థానంలో మళ్లీ కొత్తవి ఏర్పాటు చేసి నేరస్తుల ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు. ఏలూరు జిల్లా పోలీసులు చేపట్టిన ఈ ఇన్నోవేటివ్ స్టెప్ ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలిచేలా ఉంది.
Also read
- Chittoor: అతిగా జిమ్ చేసి బ్యాంక్ ఉద్యోగి మృ*తి
- Eluru Police: ఏలూరులో ‘నేను ఎవరో తెలుసా’ అంటూ దొంగల ఫ్లెక్సీలు కలకలం..
- Chandra Grahan 2026: చంద్రగ్రహణం తర్వాత స్నానం చేసి దానం చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?
- ఎంత తాగావ్రా? పాపం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులుని ముప్పుతిప్పలు పెట్టాడు! వీడియో
- సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగిన దంపతులు.. ఇంతలోనే షాకింగ్ ఘటన!.





