July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఆన్లైన్ గేమ్స్‎తో యువతి అప్పులపాలు.. డబ్బుకోసం కూతురు చేసిన పని చూసి షాకైన తల్లితండ్రులు..

ఆన్లైన్లో గేమ్స్‎కు అలవాటు పడి భారీగా డబ్బులు పోగొట్టుకున్న యువతి తిరిగి వాటిని రాబట్టుకునేందుకు మళ్లీ పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయింది. తీరా తన వద్ద డబ్బులు అన్ని అయిపోవడంతో సొంత ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సొంత ఇంట్లో దొంగలు పడ్డారని తల్లిదండ్రులను నమ్మించి డబ్బు మొత్తం కాజేసి అప్పులు తీర్చాలని భావించింది. అసలు విషయం తెలిసి పోలీసులు ఆమెను స్టేషన్‎కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు

రాజేంద్రనగర్‎లో డిగ్రీ చదువుతున్న ఒక యువతి కోసం తల్లిదండ్రులు ఆమెకు లాప్టాప్‎తో పాటు మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే వాటిని చదువు కోసం కాకుండా ఆన్లైన్లో గేమ్స్ కోసం యువతి వాడుకుంది. లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండటంతో తీవ్ర అప్పుల్లో కూరుకుంది. ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలని భావించిన యువతి ఇంట్లో ఉన్న నగదు బంగారాన్ని అపహరించాలని నిర్ణయించుకుంది. దీంతో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో భారీ పథకానికి వ్యూహరచన చేసింది. తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోగానే ఇంట్లో ఉన్న బీరువాలో దాచుకున్న నగదు మొత్తాన్ని దోచుకుంది. తిరిగి ఎవరికీ అనుమానం రాకుండా బట్టలు మొత్తాన్ని చెల్లాచెదురుగా పడేసింది. తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని తాను స్నానం చేసి వచ్చేసరికి ఇల్లు మొత్తం చెల్లాచెదురు చేశారని తల్లిదండ్రులను నమ్మించింది.

ఇది నిజమేమో అనుకొని స్థానిక రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు యువతి తల్లిదండ్రులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో ఉన్న వారితోపాటు సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. అయితే ఎవరూ కూడా ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో యువతిని పలుకోణాల్లో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తానే ఇంట్లో ఉన్న డబ్బులు నగదు అపహరించినట్లు పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చింది. యువతి స్టేట్మెంట్‎తో ఒకసారిగా పోలీసులతో పాటు తల్లిదండ్రులు సైతం అవాకయ్యారు. యువతి ప్రవర్తన చూసిన పోలీసులు ఆమెకు తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.

Also read

Related posts

Share via