కాపురంలో కలతలు.. భార్యాభర్తల మధ్య అనుమానాలు.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రగిలిపోయిన భార్య.. దారుణానికి ఒడిగట్టింది. అర్ధరాత్రి నిద్రలో ఉన్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త ప్రాణాలు విడిచాడు. మొదట గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని నమ్మించే ప్రయత్నం చేసినా.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్తపై ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పటించిన దారుణ ఘటన నారాయణపేట జిల్లాలో వెలుగు చూసింది. మరికల్ మండలం మడ్వార్ గ్రామానికి చెందిన తెలపల్లి బాలస్వామి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు రాములమ్మతో 28 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే.. బాలస్వామికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే భర్తపై కోపం పెంచుకున్న రాములమ్మ.. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. గత నెల 24వ తేదీ హత్యకు ప్లాన్ రచించింది. వ్యవసాయ పనుల కోసం ఇంట్లో ఉంచిన పెట్రోల్ను అస్త్రంగా వాడుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత భర్త బాలస్వామి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో బాలస్వామికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి బాలస్వామిని తొలుత మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ 25న బాలస్వామి మరణించాడు.
ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణను ప్రారంభించారు. అయితే హత్య కేసును పక్కదారి పట్టించేందుకు భార్య రాములమ్మ పోలీసులను తప్పుదారి పట్టించింది. గుర్తుతెలియని వ్యక్తి ఇంటి తలుపులు తట్టి, కత్తితో బెదిరించి తన భర్తకు నిప్పంటించినట్లు తెలిపింది. అయితే సాక్షుల వాంగ్మూలాలు, సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలు, ఇతర వివరాలు రాములమ్మ చెప్పినదానికి సరిపోకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది.
ఇక రాములమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. దీంతో బీఎన్ఎస్ ఆమె పై BNS 103(1), 238 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కుటుంబ కలహాలు.. వివాహేతర సంబంధం విషయంలో తలెత్తిన వివాదాలు.. చివరకు భర్త హత్యకు దారితీశాయి. తొలుత దాడి చేసింది గుర్తుతెలియని వ్యక్తులంటూ చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఖాకీల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Also read
- భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య.. ఆపై పోలీసులకు కట్టుకథ.. ఏం చెప్పిందో తెలిస్తే..
- అబ్బా జర్రుంటే.. పెళ్లైన 45 రోజులకే భర్త హత్యకు స్కెచ్.. ఎలా తప్పించుకున్నాండంటే
- తెలంగాణ : కారు రేసింగ్ సరదా.. ఓ కుటుంబంలో విషాదం!
- భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
- Telangana: తుపాకీ కోసం వెళ్తే ఊహించని ట్విస్ట్.. తనిఖీల్లో బయటపడ్డది చూసి అధికారులే అవాక్కు..





