SGSTV NEWS online
CrimeTelangana

ఓరి మీ దుంపలు తెగ.. దర్జాగా ఏటీఎంలోకి దూరారు.. చడీచప్పుడు కాకుండా పనికానిచ్చారు



మహబూబ్‌నగర్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఏటీఎం సెంటర్‌లో డబ్బులు దోచుకోవడం కష్టమని భావించిన దొంగల ముఠా.. ఏకంగా మొత్తం ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లింది. తెల్లవారుజామున బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు, ఏటీఎంను పగులగొట్టి వాహనంలో లోడ్‌ చేసుకుని పరారయ్యారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌, ఎస్పీ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.


ఏటిఎం సెంటర్‌‌లో మనీ చోరీ చేయడం కష్టతరం.. అదే ఏటిఎం మెషిన్ ను ఎత్తుకెళ్లి అందులోని నగదు చోరీ చేయడం కాస్త ఈజీ.. అలా అనుకున్నారేమో ఓ దొంగల ముఠా. మహబూబ్ నగర్ జిల్లాలో ఏకంగా ATM మొత్తాన్ని ఎత్తుకెళ్లిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా సమీపంలో ఏటీఎం చోరీ తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా ఏటీఎం సెంటర్ లోకి చొరబడి మిషన్ ను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. మొత్తానికి మొత్తం ATM మిషన్ ను ఎత్తుకెళ్లారు దోపిడీ దొంగలు. ఇవాళ తెల్లవారు జామున సరిగ్గా 2.20 నిమిషాల సమయంలో ఘటన చోటు చేసుకుంది. కొంత మంది ముఠా సభ్యులు బొలెరో వాహనం తో ATM కేంద్రం వద్దకు వచ్చారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు వాహనాన్ని పక్కన గల్లీలో దాచారు. అనంతరం ముఠా సభ్యులు అంత ఏటీఎం సెంటర్ లోకి ప్రవేశించారు. వెంట తెచ్చుకున్న పనిముట్లతో ATM మిషన్ ను పక్కకి జరిపారు. తర్వాత ATM అద్దెకు అద్దాలు ధ్వంసం చేశారు. ఇక మెల్లిగా రహదారిపై ఎవరైనా వెళ్తున్నారా లేదా చెక్ చేశారు. నిర్మానుష్యంగా ఉండడంతో గల్లీలో పార్క్ చేసిన బొలెరో వాహనాన్ని తీసుకువచ్చి అందులో ఏటీఎం మిషన్ ను లోడ్ చేసుకొని పరారయ్యారు. వెళ్తూ వెళ్తూ దుండగులు ఏటీఎం సెంటర్ లో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఇక ఉదయం విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ జానకి, 2 టౌన్ సీఐ ఏజాజుద్దీన్ ఘటన స్థలికి పరిశీలించారు. ఇక ఘటనాస్థలికి ఫోరెన్సిక్ బృందం చేరుకొని పలు ఆధారాలు సేకరించింది.


ఇక ఎత్తుకెళ్లిన ATM మిషన్ ను బోయపల్లి శివారులో లభించింది. స్థానికుల సమాచారంతో ధ్వంసమైన ఏటీఎం మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ కట్టర్ లతో మిషన్ డోర్ ఓపెన్ చేసి.. అందులో ఉన్న సుమారు రూ.2 లక్షల నగదు దోచుకున్నారు. అనంతరం మిషన్ ను అక్కడే పడేసి వెళ్లిపోయారు. జిల్లా ఎస్పీ నివాసం, పోలీసు హెడ్ క్వార్టర్స్, DIG ఆఫీసుకు సమీపంలోనే ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.



బ్యాంకు అధికారులు సైతం ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఇక సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా బొలెరో వాహనాన్ని ట్రేస్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే ఇటీవలే షాద్ నగర్ లోనూ ఇదే తరహా చోరీ జరిగిందని.. అక్కడి నిందితులు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Also read

Related posts